18 ఏళ్ల క్రితమే భారత్‌లో డేనైట్ మ్యాచ్
న్యూఢిల్లీ: ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో డే నైట్ మ్యాచ్‌లు ఓ హాట్ టాపిక్. ఆటతో కాస్త పరిచయం ఉన్న వాళ్లలో ఎవర్ని కదిలించినా దీని గురించి కాస్త వింతగానో, ఆశ్చర్యంగానో మాట్లాడుకుంటున్నారు. అయితే 138 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి డే నైట్ టెస్టుకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యాచ్ (27న)తో రంగం సిద్ధమైతే... 18 ఏళ్ల కిందటే భారత్‌లో డే నైట్ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ జరిగిందని చాలా మందికి తెలియకపోవచ్చు. 1997 ఏప్రిల్‌లో ముంబై, ఢిల్లీ మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్‌ను డే నైట్‌గా నిర్వహించారు.
గ్వాలియర్‌లోని రూప్‌సింగ్ స్టేడియం ఇందుకు వేదికైంది. అయితే ఆ మ్యాచ్‌లో తెల్లబంతిని వాడారు. కానీ ఆసీస్, కివీస్ టెస్టుకు పింక్ బంతిని ఉపయోగిస్తుండటం ఒక్కటే తేడా. మామూలుగా టెస్టు మ్యాచ్‌లో లంచ్‌తో తొలి విరామం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది రివర్స్ అయ్యింది. లంచ్ తర్వాత ఆట మొదలై టీకి 20 నిమిషాల పాటు తొలి బ్రేక్ ఇస్తారు.
స్థానిక కాలమానం ప్రకారం ఇది 4 గంటలకు ఉంటుంది. డిన్నర్ బ్రేక్‌గా పిలవబడే ‘సూపర్ బ్రేక్’ గం.6.20 మొదలై 40 నిమిషాల పాటు ఉంటుంది. ఇక 7 గంటలకు మొదలయ్యే చివరి సెషన్ పూర్తిగా ఫ్లడ్‌లైట్ల వెలుతురులో 9 గంటల వరకు కొనసాగుతుంది.