భారత జట్టు బంగ్లాదేశ్‌తో ఇప్పటి వరకు ఎనిమిది టి20 మ్యాచ్‌లు ఆడితే అన్నింటా విజయం మనదే. వరల్డ్ కప్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరు మినహా అన్నీ ఏకపక్షంగా సాగినవే. దుర్బేధ్యమైన టీమిండియా ఇప్పుడు స్వదేశంలో తొలిసారిగా బంగ్లాతో ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమైంది. కోహ్లి లేకున్నా భారత్ బలం ఏమాత్రం తగ్గలేదు. కానీ షకీబ్, తమీమ్‌లాంటి ఇద్దరు స్టార్ ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగుతున్న బంగ్లా ఎంత వరకు పోటీనిస్తుందో చూడాలి. అయితే అన్నింటికి మించి ఢిల్లీ కాలుష్యం నీడలో ఈ మ్యాచ్ జరగడంపైనే అందరి దృష్టి నెలకొంది. పొగమంచుతో కమ్మేసిన నగరంలో మూడు గంటలకుపైగా ఆటగాళ్లు ప్రత్యర్థితో పాటు వాతావరణంతో కూడా పోటీ పడాల్సి ఉంటుంది.
న్యూఢిల్లీ: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను సునాయాసంగా ఓడించిన తర్వాత భారత జట్టు టి20 ఫార్మాట్‌తో కొత్త సిరీస్‌ను మొదలు పెడుతోంది. కోహ్లి గైర్హాజరులో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడుతోంది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య నేడు తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. సీనియర్లతో పాటు పలువురు కుర్రాళ్లు భారత్ తరఫున తమ సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యారు. ఫిక్సింగ్ వివాదంతో ఐసీసీ నిషేధానికి గురైన షకీబ్ లేకపోవడంతో డీలా పడిన బంగ్లాదేశ్ టీమ్‌లో కూడా పలువురు యువ ఆటగాళ్లు తొలి విజయం అందుకోవాలని పట్టుదలగా ఉన్నారు.
శివమ్ దూబేకు చాన్స్..
గత సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ ఆఖరి సారిగా బెంగళూరులో టి20 మ్యాచ్‌లో ఆడింది. అందులో ఆడిన వారిలో దాదాపు అందరికీ ఇక్కడ తుది జట్టులో స్థానం లభించే అవకాశం ఉంది. భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ చెలరేగిపోతే మనకు తిరుగుండదు. మరో ఓపెనర్‌గా శిఖర్ ధావన్ రాణించడం కీలకం. బెంగళూరు మ్యాచ్ తర్వాత విజయ్ హజారేలో వన్డేలు ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక అర్ధ సెంచరీ చేశాడు. ఇక్కడ అతను ఎంత దూకుడుగా ఆడతాడనేది ఆసక్తికరం. కోహ్లికి బదులుగా రాహుల్‌కు అవకాశం లభించవచ్చు. అయితే సంజు సామ్సన్ నుంచి అతనికి పోటీ ఎదురవుతోంది. తర్వాతి స్థానాల్లో పంత్, అయ్యర్‌లు చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు.
రోహిత్ శర్మ మీడియా సమావేశాన్ని బట్టి చూస్తే ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబే అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైంది. హార్దిక్‌కు బదులుగా జట్టులోకి వచ్చిన శివమ్ అదే తరహాలో విధ్వంసకర బ్యాటింగ్ చేయగల సమర్థుడు. కొంత విరామం తర్వాత టీమ్‌లోకి వచ్చిన లెగ్ స్పిన్నర్ చహల్‌ను కూడా ఆడించాలనే ఆలోచనతో మేనేజ్‌మెంట్ ఉంది. దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్‌లలో ఇద్దరు పేసర్లు బరిలోకి దిగుతారు. బెంగళూరులో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన అనూహ్య ఓటమిని పక్కన పెడితే స్వదేశంలో ఐపీఎల్‌తో అపార అనుభవం ఉన్న మన జట్టును నిలువరించడం దాదాపు అసాధ్యం.
ముగ్గురే కీలకం...
మహ్ముదుల్లా, ముష్ఫికర్, ముస్తఫిజుర్... బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్‌లో ఏమైనా విజయావకాశాలు ఉండాలంటే ఈ ముగ్గురిపైనే ఆధారపడి ఉంది. పైకి ఎన్ని మాటలు చెప్పినా... టాప్ ఆల్‌రౌండర్ షకీబ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. పైగా వ్యక్తిగత కారణాలతో స్టార్ ఓపెనర్ తమీమ్ కూడా లేకపోవడంతో ఆ జట్టు బ్యాటింగ్ బలహీనపడింది. కెప్టెన్‌గా అదనపు బాధ్యత మోస్తున్న మహ్ముదుల్లా ధాటిగా ఆడగల సమర్థుడు. ముష్ఫికర్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది.
ముస్తఫిజుర్ బౌలింగ్‌లో గతంలో ఉన్నంత పదును కనిపించకపోయినా ఇప్పటికీ బంగ్లాకు అతను పెద్ద బలం. పైగా ఐపీఎల్‌లో ఆడుతున్న అనుభవం కూడా ఉంది. బంగ్లా రికార్డు చూస్తే ఈ ముగ్గురు కాకుండా మిగతావారి ఆట గాలిలో దీపంలాంటిదే. సీపీఎల్‌లో అనుభవం తర్వాత లిటన్ దాస్ బ్యాటింగ్ కొంత మెరుగుపడింది. కొత్త ఆటగాడు నయీమ్‌కు అవకాశం దక్కవచ్చు. అల్ అమీన్, అబూ హైదర్‌లాంటి బౌలర్లు భారత్‌ను ఎంత మేరకు నిలువరిస్తారనేది సందేహమే.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, రాహుల్/సామ్సన్, పంత్, అయ్యర్, శివమ్ దూబే, కృనాల్, వాషింగ్టన్, చహల్, దీపక్ చహర్, శార్దుల్/ఖలీల్.
బంగ్లాదేశ్: మహ్ముదుల్లా (కెప్టెన్), దాస్, సర్కార్, నయీమ్, ముష్ఫికర్, మొసద్దిక్, అఫీఫ్, అరాఫత్, ముస్తఫిజుర్, అల్ అమీన్, అబూ హైదర్/తైజుల్.
పిచ్, వాతావరణం
టి20 ఫార్మాట్‌కు తగినట్లుగా బ్యాటింగ్‌కు అనుకూలం. కొంత వరకు స్పిన్ ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీపావళి తర్వాత ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’ ప్రకటించిన సమయంలో పూర్తి కాలుష్యభరిత వాతావరణంలో మ్యాచ్ జరుగుతోంది. ఆటకు అంతరాయం కలగకపోయినా క్రికెటర్లకు ఇబ్బంది మాత్రం తప్పకపోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment