
గువహటి: భారత్‌తో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడేందుకు శ్రీలంక క్రికెట్ జట్టు గురువారం ఇక్కడకు చేరుకుంది. లసిత్ మలింగ నాయకత్వంలో వచ్చిన జట్టు సభ్యులకు ఘనస్వాగతం లభించింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో తీవ్ర నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో లంక జట్టుకు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఆదివారం ఇరు జట్ల మధ్య ఇక్కడ తొలి టి20 మ్యాచ్ జరగాల్సి ఉంది. ప్రస్తుత స్థితిలో మ్యాచ్ నిర్వహణపై కూడా సందేహాలు కనిపిస్తున్నాయి. అయితే తాము జాగ్రత్తలు తీసుకున్నట్లు అసోం క్రికెట్ సంఘం (ఏసీఏ) ప్రతినిధులు వెల్లడించారు.
సుమారు 39,500 మంది ప్రేక్షకుల సామర్థ్యం గల బర్సపర స్టేడియంలో టి20 కోసం ఇప్పటికే 27 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని వారు చెప్పారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఇప్పటికే అభిమానులు క్రిస్మన్, కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు కాబట్టి క్రికెట్‌కు సమస్య లేదని స్పష్టం చేశారు. భారత ఆటగాళ్లు శుక్రవారంనాడు నగరానికి చేరుకునే అవకాశం ఉంది. నేడు ఇరు జట్లకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్లు ఏర్పాటు చేశారు.