రవికుమార్
సాక్షి, భువనేశ్వర్: భారత వెయిట్‌లిఫ్టర్లు డోపింగ్‌లో దొరికిపోయారు. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్న ఐదుగురు డోపీల్లో కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్, ఒడిశాకు చెందిన కత్తుల రవికుమార్ ఉన్నాడు. 2010లో బంగారం నెగ్గిన రవి... 2014లో రజతం గెలిచాడు. అతనితో పాటు జూనియర్ కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత పూర్ణిమా పాండే, హీరేంద్ర సారంగ్, దీపిక శ్రీపాల్, గౌరవ్ తోమర్ ఉన్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన పరీక్షల్లో వీరంతా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు. స్టార్ లిఫ్టర్ రవి ‘ఒస్టారిన్’ అనే ఉత్ప్రేరకం తీసుకున్నాడు. ఇది కండరాల శక్తిని పెంచేది.
విశాఖపట్నంలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో అతనికి నిర్వహించిన పరీక్షల్లో దొరికిపోవడం జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ వర్గాల్ని కలవరపరిచింది. అయితే ఈ డోపింగ్ ఉదంతంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కోటా బెర్తులకు వచ్చిన ముప్పేమీ లేదని భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్‌ఎఫ్) కార్యదర్శి సహదేవ్ యాదవ్ స్పష్టం చేశారు. ‘నాడా’ భారత్‌కు సంబంధించిన సంస్థ అని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) చేసే పరీక్షల్నే అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) పరిగణిస్తుందని ఆయన చెప్పారు. కొత్త ఐడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం 2008 నుంచి 2020 వరకు ఏదైనా దేశంలో 20 లేదా అంతకంటే ఎక్కువ డోపీలు పట్టుబడితే ఒలింపిక్స్ కోటా బెర్తుల్ని ఆ దేశం కోల్పోతుంది.
Comments
Please login to add a commentAdd a comment