కుంబ్లేతో వివాదం.. తప్పంతా కోహ్లిదే!
న్యూఢిల్లీ: కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే వివాదంపై మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ స్పందించాడు. టీమిండియా కోచ్‌గా కుంబ్లేనే కొనసాగితే బాగుంటుందని భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ అభిప్రాయపడ్డాడు. చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓటమి అనంతరం ఆటగాళ్లపై కోచ్‌గా ఉన్న కుంబ్లే ఆగ్రహం వ్యక్తం చేయడంలో అసలు తప్పేలేదన్నాడు. ఫైనల్లో వారి ఆటతీరు చూసి ఏ కోచ్ అయినా అలాగే స్పందిస్తారంటూ కుంబ్లేకే తన మద్ధతు తెలిపాడు అన్షుమన్ గైక్వాడ్. 1990 దశకం చివర్లో భారత జట్టుకు కోచ్‌గా పనిచేసిన గైక్వాడ్ ఈ వివాదంపై మరిన్ని అంశాలు ప్రస్తావించాడు.
'కుంబ్లే నిబద్ధత, అంకితభావం అందరికీ తెలుసు. కుంబ్లే, కోహ్లిల మధ్య వివాదమేంటో అంతగా తెలియదు. కానీ మీడియాలో వచ్చిన కథనాలను పరిశీలిస్తే కోహ్లి దురుసు ప్రవర్తనతో కుంబ్లే మనసు నొచ్చుకుంది. అందుకే తెగే వరకు లాగొద్దని భావించి కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేశాడనుకుంటున్నా. బీసీసీఐతో కుంబ్లేకు ఉన్న కాంట్రాక్టు ఎలాంటిదో స్పష్టతలేదు. ఓ టోర్నీ తర్వాత ఆటగాళ్ల ప్రదర్శన, ప్రవర్తనపై నిర్ణయం తీసుకునే అధికారం కోచ్‌గా కుంబ్లేకు ఉందని నమ్ముతున్నాను. కుంబ్లే అప్పటివకప్పుడే స్పందించడంతో ఆటగాళ్లు రాద్ధాంతం చేశారు. కోచ్ తన మనసులో మాటను ఆటగాళ్లకు చెప్పడంపై బీసీసీఐ పరిమితులు విధిస్తుందని తాను భావించడం లేదని' గైక్వాడ్ వివరించాడు. మాజీ కోచ్, మేనేజర్ అజిత్ వాడేకర్, మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం కోహ్లీ తీరును తప్పుపట్టిన విషయం తెలిసిందే.