రాజ్‌కోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ అనవరమైన చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా అవతరించాడు. ఈ చెత్త రికార్డును ఆండర్సన్.. భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఖాతాలో నుంచి లాగేసుకున్నాడు.
2008లో రిటైరైన కుంబ్లే 132 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్‌లో 18, 355 పరుగులు సమర్పించుకోగా.. ఆండర్సన్ తన 185వ టెస్ట్‌లో కుంబ్లే రికార్డును అధిగమించాడు (18, 371). ఈ జాబితాలో లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ మూడో స్థానంలో (133 టెస్ట్‌ల్లో 18180 పరుగులు) ఉండగా.. ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్ (17995), ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (16719) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
41 ఏళ్ల ఆండర్సన్ ప్రస్తుతం 696 వికెట్లతో టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ (800), షేన్ వార్న్ (708) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇదే మ్యాచ్‌లో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 500 వికెట్ల మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లు వేసిన ఆండర్సన్ 61 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీ (118 బంతుల్లో 133 నాటౌట్; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) అనంతరం ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనితో పాటు జో రూట్ (9) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (15), ఓలీ పోప్ (39) ఔటయ్యారు. క్రాలే వికెట్ అశ్విన్‌కు దక్కగా.. పోప్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలతో మెరిశారు.
Comments
Please login to add a commentAdd a comment