భారత బాక్సర్లకు క్లిష్టమైన డ్రా
రియో డీజనీరో:రియో ఒలింపిక్స్లో భారత బాక్సర్లకు క్లిష్టమైన డ్రా ఎదురైంది. భారత్ నుంచి బాక్సింగ్ విభాగంలో శివ థాపా(56కేజీలు), మనోజ్ కుమార్(64కేజీలు), వికాస్ క్రిషన్(75 కేజీలు)లు తమ తొలి పోరులో కఠినమైన ప్రత్యర్థులను ఎదుర్కొనున్నారు. ఈ మేరకు గురువారం ప్రకటించిన డ్రాలో వికాస్ క్రిషన్ ఒక్కడికే సీడింగ్ లభించగా, మిగతా ఇద్దరూ అన్ సీడెడ్గా బరిలోకి దిగనున్నారు. రియో ఒలింపిక్స్లో వికాస్ ఏడో సీడ్గా పోరుకు సన్నద్ధమయ్యాడు.
కాగా, ఈ మెగా ఈవెంట్లో శివ థాపా తన తొలి పోరులో గత లండన్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతక విజేత, క్యూబా బాక్సర్ రాబ్సీ రామ్రెజ్తో తలపడనున్నాడు. అయితే 2010 యూత్ ఒలింపిక్స్లో శివ థాపాతో జరిగిన ముఖాముఖి పోరులో రాబ్బీ విజేతగా నిలిచాడు. ఈ బాక్సర్లు ఇద్దరూ వరల్డ్ చాంపియన్ షిప్లో కాంస్య పతకాలు సాధించడంతో ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది. వీరి మద్య ఆగస్టు 9వ తేదీన బౌట్ జరుగనుంది.
మరో భారత బాక్సర్ వికాస్ క్రిషన్.. అమెరికా యువ బాక్సర్ చార్లెస్ కోన్ వెల్తో ఓపెనింగ్ గేమ్ లో తలపడనుండగా, గత ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఎవాల్దాస్ పెట్రాస్కాస్తో మనోజ్ కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ రెండు బౌట్లు ఆగస్టు 10 వ తేదీన జరుగనున్నాయి.