పతకానికి అడుగు దూరంలో..
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ పంచ్ అదిరింది. 75 కేజీల మిడిల్వెయిట్ విభాగంలో బరిలోకి దిగిన వికాస్ క్వార్టర్స్కు చేరుకున్నాడు. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన పోరులో వికాస్ 3-0 తేడాతో సైపల్ ఓండర్(టర్కీ)పై గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్ నుంచి ప్రత్యర్థిపై విరుచుకుపడ్డ వికాస్ ఆద్యంత పైచేయి సాధించి నాకౌట్ విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే కాకుండా పతకానికి అడుగు దూరంలో నిలిచాడు.
ఒకానొక దశలో వికాస్ పంచ్లకు ఓండర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని కంటినుంచి రక్తం కారడంతో 38 సెకెండ్లపాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తరువాత కూడా వికాస్ మరింత దూకుడునే కొనసాగించి ఓండర్ ను చిత్తు చేశాడు. దీంతో జడ్జిల ఏకపక్ష నిర్ణయంతో విజయాన్ని సొంతం చేసుకుని క్వార్టర్స్లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ బెక్తిమిర్ మెలికుజివ్తో తలపడేందుకు సిద్ధమయ్యాడు. 2015 ఆసియన్ చాంపియన్షిప్స్ ఫైనల్లో వీరిద్దరి మధ్య జరిగిన ముఖాముఖి పోరులో మెలికుజివ్ విజయం సాధించాడు. మరోవైపు 2014 యూత్ ఒలింపిక్ చాంపియన్ అయిన మెలికుజివ్.. గతేడాది వరల్డ్ చాంపియన్షిప్లో రజతాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో వీరి మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది.