నేటి నుంచి యాషెస్‌ నాలుగో టెస్టు | fourth Test of the Ashes since today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి యాషెస్‌ నాలుగో టెస్టు

Published Tue, Dec 26 2017 12:18 AM | Last Updated on Tue, Dec 26 2017 12:21 AM

fourth Test of the Ashes since today - Sakshi

మెల్‌బోర్న్‌: ఇప్పటికే ఇంగ్లండ్‌ యాషెస్‌ సిరీస్‌ను కోల్పోయింది. ఇంకా సాధించడానికేమీ లేదు. కానీ పరువు నిలబెట్టుకోవాలంటే చివరి రెండు టెస్టుల్లో గెలవాలి. ఈ నేపథ్యంలో ‘బాక్సింగ్‌ డే’ టెస్టులో విజయమే లక్ష్యంగా ఇంగ్లండ్‌... ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. మంగళవారం నుంచి మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో ఈ మ్యాచ్‌ జరగనుంది. వరుస వైఫల్యాలతో ఆటగాళ్లు,  ఘోర పరాజయాలతో ఇంగ్లండ్‌ జట్టు ఈ ‘యాషెస్‌’లో విలవిల్లాడుతోంది. విశేష అనుభవమున్న కుక్‌ పేలవ ఫామ్‌ జట్టును కలవరపరుస్తోంది. బ్రాడ్, మొయిన్‌ అలీలు కూడా బాధ్యతలకు దూరంగా... జట్టుకు భారంగా మారారు. కెప్టెన్‌ రూట్‌కు ఇప్పటిదాకా ఆసీస్‌ గడ్డపై ఏ మ్యాచ్‌ కూడా కలిసిరాలేదు. భారీ పరాజయాలతోనే మ్యాచ్‌ల్ని, సిరీస్‌ను కోల్పోయాడు. ఇప్పటికైనా సీనియర్లు బాధ్యతలు పంచుకుంటే జట్టు గాడిన పడుతుందని రూట్‌ భావిస్తున్నాడు. దీంతో కనీసం ట్రోఫీ పోయినా పరువు కాపాడుకోవచ్చని ఆశిస్తున్నాడు. ఇంగ్లండ్‌ యువ పేసర్‌ టామ్‌ కురన్‌ ఈ టెస్టుతో అరంగేట్రం చేయనున్నాడు.

మరోవైపు ఆస్ట్రేలియా సారథి స్టీవెన్‌ స్మిత్‌ అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. ఆత్మవిశ్వాసంతో ఉన్న కంగారూ జట్టు వరుసగా నాలుగో విజయంపై కన్నేసింది. గాయపడిన మిచెల్‌ స్టార్క్‌ స్థానంలో జాక్సన్‌ బర్డ్‌ నాలుగో టెస్టు బరిలోకి దిగుతాడని కెప్టెన్‌ స్మిత్‌ చెప్పాడు. ఆస్ట్రేలియా కోచ్‌ డారెన్‌ లీమన్‌ 2019 తర్వాత బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2013 నుంచి ఆయన కోచింగ్‌లో ఆసీస్‌ సొంతగడ్డపై రెండు యాషెస్‌ సిరీస్‌లను గెలుచుకోగా.. ఇంగ్లండ్‌లో మరో రెండు ఓడిపోయింది. 2015 వన్డే ప్రపంచకప్‌ సాధించింది. 

జట్లు:
ఆస్ట్రేలియా:
స్మిత్‌ (కెప్టెన్‌), వార్నర్, బాన్‌క్రాఫ్ట్, ఖాజా, మార్‌‡్ష, మిచెల్‌ మార్‌‡్ష, పైన్, కమిన్స్, హాజల్‌వుడ్, లయన్, బర్డ్‌. 
ఇంగ్లండ్‌: జో రూట్‌ (కెప్టెన్‌), కుక్, స్టోన్‌మన్, విన్స్, మలన్, బెయిర్‌స్టో, మొయిన్‌ అలీ, వోక్స్, కురన్, బ్రాడ్, అండర్సన్‌. 

ఉ. గం. 5.00 నుంచి  సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement