ఒలింపిక్స్ టీమ్పై దాడికి తీవ్రవాదుల కుట్ర
పారిస్: రియో ఒలింపిక్స్ క్రీడల్లో తమ జట్టుపై తీవ్రవాదులు దాడికి కుట్ర పన్నారని ఫ్రాన్స్ వెల్లడించింది. పథకం ప్రకారం తమ స్పోర్ట్స్ టీమ్పై దాడి చేయాలని తీవ్రవాదులు పన్నాగం చేస్తున్నారని ఫ్రాన్స్ మిలటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్(డీఆర్ఎం) అధిపతి జనరల్ క్రిస్టోఫి గొమార్ట్ అధికారిక నివేదికలో పేర్కొన్నారు. మే నెలలో పార్లమెంటరీ కమిషన్కు సమర్పించిన నివేదికలో ఆయనీ విషయాన్ని పొందుపరిచారు.
పారిస్లో గత నవంబర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిపై దర్యాప్తు జరుపుతుండగా ఈ కుట్ర గురించి తెలిసిందని పేర్కొన్నారు. బ్రెజిల్ పౌరుడితో దాడి చేయించాలని తీవ్రవాదులు వ్యూహం రచించారని తెలిపారు. ఎప్పుడు, ఎక్కడ దాడి చేయనున్నారనే వివరాలు వెల్లడి కాలేదు. అయితే దీనికి సంబంధించి ఫ్రాన్స్ నుంచి తమకు ఎటువంటి అధికారిక సమాచారం లేదని బ్రెజిల్ ప్రభుత్వం తెలిపింది.
రియో ఒలింపిక్స్లో ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశముందని బ్రెజిల్ న్యాయశాఖ మంత్రి అలెగ్జాండర్ మొరాయిస్ ఈ నెలారంభంలో అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ లో పాల్గొనే 10,500 మంది అథెట్లకు రక్షణ కల్పించేందుకు 85 వేల మందితో భారీ భద్రత ఏర్పాటు చేస్తోంది. ఇందులో 47 వేల మంది పోలీసులు కాగా, 38 వేల మంది సైనికులు.