
శ్రీలంక పోరాటం
విజయ లక్ష్యం 388
ప్రస్తుతం 170/3 ∙జింబాబ్వేతో టెస్టు
కొలంబో: జింబాబ్వేతో ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన శ్రీలంక జట్టు... ఏకైక టెస్టులో విజయం కోసం పోరాడుతోంది. 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక నాలుగో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 48 ఓవర్లలో మూడు వికెట్లకు 170 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (85 బంతుల్లో 60 బ్యాటింగ్; 6 ఫోర్లు) కీలక అర్ధ సెంచరీతో అండగా ఉన్నాడు. ఆటకు నేడు (మంగళవారం) చివరి రోజు కాగా విజయానికి ఆతిథ్య జట్టు మరో 218 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఏడు వికెట్లున్నాయి. గతంలో లంక అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన 352 మాత్రమే (దక్షిణాఫ్రికాపై).
ఓపెనర్ కరుణరత్నే (84 బంతుల్లో 49; 1 ఫోర్) ఫర్వాలేదనిపించాడు. క్రీజులో మెండిస్‌తో పాటు ఏంజెలో మాథ్యూస్ (33 బంతుల్లో 17 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్స్) ఉన్నాడు. క్రెమెర్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 252/6తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే 107.1 ఓవర్లలో 377 పరుగులకు ఆలౌటయ్యింది. సికిందర్ రజా (205 బంతుల్లో 127; 9 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్‌లో తొలి శతకం సాధించగా... వాలర్ (98 బంతుల్లో 68; 8 ఫోర్లు) రాణించాడు. లంక బౌలర్లలో హెరాత్‌కు ఆరు, పెరీరాకు మూడు వికెట్లు దక్కాయి.