ఎడారిలో సరదా సరదాగా..! | Fun .. fun in the desert! | Sakshi
Sakshi News home page

ఎడారిలో సరదా సరదాగా..!

Published Tue, Apr 29 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 6:39 AM

ఎడారిలో సరదా సరదాగా..!

ఎడారిలో సరదా సరదాగా..!

అబుదాబి: ఐపీఎల్-7ను యూఏఈలో నిర్వహించడమే అనూహ్యం. వేదిక ఎంపికపై  చివరి వరకు తాత్సారం చేసిన గవర్నింగ్ కౌన్సిల్, ఫ్రాంచైజీల ఒత్తిడి పెరిగిపోవడంతో హడావిడిగా నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల పరంగా చూస్తే పూర్తిగా తటస్థ వేదికపై క్రికెట్ ఆడనుండటం  కొత్తగా అనిపించింది. ముఖ్యంగా అభిమానుల ఆదరణపై సందేహాలు ఉండేవి. అయితే ఒక్కసారి టోర్నీ ఆరంభమయ్యాక అవన్నీ వెనక్కి వెళ్లిపోయాయి.

మ్యాచ్‌లకు మంచి ఆదరణ లభించగా...క్రికెటర్లు కూడా పూర్తిగా ఖుష్ అయ్యారు. పైగా భారత్ తరహాలో ప్రతీ చోటా మీడియా దృష్టి ఉండని ప్రాంతం కావడంతో వారు కూడా అన్ని రకాలుగా ఎంజాయ్ చేశారు. నిర్వాహకులు కూడా టోర్నీ ఆరంభంలోనే గోల్ఫ్ డే జరపగా... ఫలితాలు, ప్రదర్శనతో సంబంధం లేకుండా ఆటగాళ్లు యూఏఈలో సరదాగా  గడిపారు. క్రికెటర్ల వ్యాఖ్యలు, ట్వీట్స్ చూస్తే వాటి నిండా దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా, పామ్ జువేరా కబుర్లే...

మాస్టర్ ‘స్టూడెంట్’!
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత ఇప్పుడు ముంబై జట్టు మెంటర్‌గా సచిన్ టెండూల్కర్ బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. తన జట్టు ప్రదర్శన తీసికట్టుగా ఉన్నా... యూఈఏ లెగ్ ఐపీఎల్‌ను తన కోచింగ్ కోసం ఉపయోగించుకున్నాడు. అయితే అతను శిక్షణ పొందుతోంది గోల్ఫ్‌లో కావడం విశేషం. గతంలో చాలా మంది ఆటగాళ్ళలాగే అతనూ సరదాగా గోల్ఫ్‌లో ఒక చేయి వేసినా....ప్రొఫెషనల్ తరహాలో ఎప్పుడూ ఆసక్తి కనబర్చలేదు. అయితే ఈ సారి మాత్రం దుబాయ్‌లోని ఎల్స్ క్లబ్‌లో అతను పక్కాగా ఆటపై దృష్టి పెట్టాడు. ప్రఖ్యాత కోచ్ జస్టిన్ పార్సన్ వద్ద మెళకువలు నేర్చుకున్నాడు. మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్‌లు కూడా గోల్ఫ్‌లో సచిన్‌ను అనుసరిస్తూ...ఎక్కువ సమయం ఇక్కడే గడిపారు.

స్టెయిన్ స్కై డైవింగ్
 సన్‌రైజర్స్ సూపర్ పేసర్ డేల్ స్టెయిన్ అయితే తన జీవితంలో ఎన్నాళ్లుగానో ఉండిపోయిన కోరికను దుబాయ్‌లో తీర్చుకున్నాడు. సోమవారం అతను భూమికి దాదాపు 850 మీటర్ల ఎత్తునుంచి పామ్ జువేరా బీచ్ మీదుగా స్కై డైవింగ్ చేశాడు. ‘మహాద్భుతం...జీవితంలో తొలిసారి స్కై డైవింగ్ అనుభవం గొప్పగా ఉంది’ అని ట్వీట్ చేశాడు. నేను క్రికెటర్‌నా, మోడల్‌నా అని నిర్వేదం కనబర్చినా... ఫొటో షూట్లలో కూడా ఉత్సాహంగానే పాల్గొన్నాడు.

వార్నర్‌కు వేడి..!
 బ్యాటింగ్‌లో అంతంత మాత్రం ప్రదర్శనే ఉన్న డేవిడ్ వార్నర్ కూడా తన నెచ్చెలి క్యాండిస్ ఫాల్జన్‌తో కలిసి యూఏఈ వచ్చాడు. బీచ్‌లలో ఎంజాయ్ చేస్తున్న అతను దుబాయ్ ఎడారుల్లో కూడా డ్రైవింగ్‌తో తన సరదా తీర్చుకున్నాడు. అయితే మధ్యలో రోడ్డుపై కారు చెడిపోవడంతో స్థానికుల సహకారం తీసుకున్నాడు. ‘45 డిగ్రీల ఎండ చంపేస్తోంది...అయినా ఇదో కొత్త అనుభవం’ అంటూ అతను ట్వీట్ చేశాడు.

చెన్నై చమక్కులు
 చెన్నై క్రికెటర్ డు ప్లెసిస్ ప్రఖ్యాత యాస్ వాటర్ వరల్డ్‌లో తన భార్య ఇమారీతో కలిసి షికారు చేసొచ్చాడు. రైనా తదితర సహచరులతో కలిసి వరల్డ్‌లో ఫాస్టెస్ట్ రోలర్ కోస్టర్ ఫార్ములా రోసాలో ఎంజాయ్ చేశాడు.

కలిస్ సరదాలు
 కోల్‌కతా ఆటగాడు జాక్ కలిస్ కూడా యూఏఈ ట్రిప్‌ను బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. సహచరులతో కలిసి డిజర్ట్ సఫారీకి వెళ్లిన అతను తన గర్ల్‌ఫ్రెండ్, 2011 మిస్ సౌతాఫ్రికా కిమ్ రివలాండ్‌తో కలిసి షికారు చేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లూ తక్కువేమీ కాదు. ఎడారిలో వారి సవారి జోరుగా సాగింది. వాట్సన్, స్టీవెన్ స్మిత్ తమ భాగస్వాములతో కలిసి ఎడారిలో షికారు కొట్టారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement