
మైదానంలో మన క్రికెటర్ల మాటల యుద్ధం
న్యూఢిల్లీ: ఐపీఎల్ చిత్రమైనది. మన ఆటగాళ్లే ప్రత్యర్థులుగా మారి తలపడతారు. విదేశీ ఆటగాళ్లతో కలసి ఓ జట్టుగా ఆడుతారు. ఇందులో జాతీయతకు తావు లేదు. దేశం కోసం కలసి కట్టుగా ఆడిన ఆటగాళ్లే ప్రత్యర్థులుగా మారి మాటల యుద్ధానికి దిగారు. ఐపీఎల్-2017 సీజన్‌లో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. కోల్‌కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్, పుణె బ్యాట్స్‌మన్ మనోజ్ తివారి మాటలకు పదును పెట్టారు.
కోల్‌కతా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 15వ ఓవర్లో గంభీర్.. మనోజ్‌ను దూషిస్తున్నట్టుగా మాట్లాడాడు. దీంతో మనోజ్ కూడా వెనక్కు తగ్గలేదు. ఫీల్డింగ్ స్థానం నుంచి ముందుకు పరిగెత్తి గంభీర్‌ను ఉద్దేశిస్తూ ఒకటి రెండు ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్నంత వరకూ ఈ తతంగం సాగింది. కాగా గంభీర్, మనోజ్ ఇద్దరూ మైదానంలో తిట్టుకోవడం ఇదే తొలిసారి కాదు. 2015లో రంజీ ట్రోఫీలో వీరిద్దరూ గొడవపడ్డారు. క్రమశిక్షణ చర్యల కింద మ్యాచ్ ఫీజులో గంభీర్‌కు 70 శాతం, మనోజ్‌కు 40 శాతం చొప్పున జరిమానా వేశారు.