మనోజ్ తివారీతో గంభీర్ వాగ్వాదం
న్యూఢిల్లీ:దేశవాళీ క్రికెట్ లీగ్ లో భాగంగా ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బెంగాల్-ఢిల్లీ జట్ల జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ లో మనోజ్ తివారీపై గౌతం గంభీర్ దూషణలకు పాల్పడ్డాడు. తొలుత గంభీర్-తివారీలు మధ్య చోటుచేసుకున్నమాటల యుద్ధం కాస్త ఉద్రికత్త పరిస్థితులకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ జట్టుకు గంభీర్ నేతృత్వం వహిస్తుండగా, బెంగాల్ జట్టుకు మనోజ్ తివారీ సారథ్యం వహిస్తున్నాడు. అయితే ఢిల్లీ పేసర్ మనన్ శర్మ బౌలింగ్ లో బెంగాల్ ఆటగాడు పార్థసారధి భట్ట ఛటర్జీ అవుటైన తరువాత మనోజ్ తివారీ కేవలం క్యాప్ పెట్టుకుని మాత్రమే బ్యాటింగ్ కు వచ్చాడు.
నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి క్రీజ్ లోకి వచ్చిన తివారీ గార్డ్ తీసుకున్న అనంతరం బ్యాటింగ్ కు సిద్దమయ్యాడు. ఈ క్రమంలోనే బౌలర్ మనన్ శర్మ బౌలింగ్ వేయబోతుండగా అతన్ని తివారీ ఆపాడు. డ్రెస్సింగ్ రూమ్ లో సహచరులకు సైగ చేస్తూ హెల్మెట్ తేవాల్సిందిగా తివారీ కోరాడు. దీంతో ఫస్ట్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న గంభీర్ రెచ్చిపోయాడు. క్రీజ్ లోకి వచ్చేటప్పుడు హెల్మెట్ తెచ్చుకోవాలని తెలియదా?అంటూ మనోజ్ తివారీపై దూషణలకు దిగాడు. తివారీ కూడా దీటుగా స్పందించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. దాంతో సహనం కోల్పోయిన గంభీర్.. జాగ్రత్త ఉండకపోతే తన చేతుల్లో దెబ్బలు తినాల్సి వస్తుందంటూ తివారిపై నోరు పారేసుకున్నాడు. ఆ గొడవను సద్దుమణిచేందుకు యత్నించిన అంపైర్ శ్రీకాంత్ ను కూడా గంభీర్ తోసుకుంటూ వెళ్లి మరీ తివారీని హెచ్చరించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై మనోజ్ తివారీ స్పందిస్తూ.. ఫీల్డ్ లో ఏం జరిగిందనేది వీడియోలో ఉంటుందని, గౌతం గంభీర్ ను ఒక సీనియర్ గా తాను ఎప్పుడూ గౌరవమిస్తానన్నాడు. కాగా, గంభీర్ తన లైన్ ను దాటడం పట్ల తివారీ ఆవేదన వ్యక్తం చేశాడు.