ధోని, గంభీర్ (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : భారత్, ఆసీస్, శ్రీలంకల మధ్య జరిగిన ముక్కోణపు సీబీ సిరీస్-2012లో తుది జట్టు ఎంపిక విషయంలో నాటి టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేస్తూ గంభీర్ మండిపడ్డాడు. ఇటీవలే అన్ని ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన గౌతీ ఆంధ్రతో జరిగిన రంజీ మ్యాచ్‌లో చివరి సారిగా బరిలోకి దిగాడు. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో సెంచరీతో తన కెరీర్‌కు ఘనంగా గుడ్‌బై చెప్పాడు. అనంతరం మీడియాతో మచ్చటించాడు.
‘2015 ప్రపంచకప్ దృష్ట్యా యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించేందుకు ఈ ముక్కోణపు సిరీస్‌లో ఇద్దరు ఓపెనర్లనే తీసుకుంటానని కెప్టెన్ ధోనీ స్పష్టంజేశాడు. ధోని తీసుకున్న నిర్ణయం నన్నే కాదు ఏ క్రికెటర్‌కైనా షాక్‌కు గురి చేసేదే.. 2015 ప్రపంచకప్ జట్టులో ఉండబోరని 2012లో చెప్పడం నేనెప్పుడు వినలేదు. పరుగులు చేస్తున్నంత వరకూ వయసు అడ్డంకి కాదని నేను ఎప్పుడూ భావిస్తుండేవాడిని. ఈ సిరీస్‌లో హోబర్ట్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి.
ఆ మ్యాచ్‌లో ధోని అనూహ్యంగా మా ముగ్గురిని ఆడించాడు. ఓపెనర్లుగా సెహ్వాగ్, సచిన్‌లు రాగా.. నేను, కోహ్లి మూడు, నాలుగు స్థానంలో వచ్చాం. ఆ మ్యాచ్‌లో మేం 37 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. ముక్కోణపు సిరీస్ ప్రారంభంలో ముగ్గురు ఓపెనర్లం ఆడలేదు. ఒకసారి ఒకరికి మరోసారి ఇంకొకరికి అవకాశం కల్పించారు. కానీ తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో ముగ్గుర్నీ ధోనీ ఆడించాడు. అంటే తన నిర్ణయాన్ని అతడు మార్చుకున్నట్టే కదా. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉండాలి’ అని గంభీర్ నాటి రోజులను గుర్తు చేసుకుంటూ ధోనిని తప్పుబట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment