న్యూఢిల్లీ: ఏడేళ్ల కిందట టీమిండియా కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని కొట్టిన సిక్స్‌ను క్రికెట్ అభిమానులు మరిచిపోలేరు. ఎందుకంటే అది భారత జట్టుకు వన్డే ప్రపంచ కప్‌ను అందించిన మధురక్షణం. 2011 ఏప్రిల్ 2న ముంబైలోని వాంఖేడే మైదానంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ధోని సిక్స్ కొట్టి భారత్‌కు వరల్డ్‌కప్‌ను ఖాయం చేశాడు. ఆ మ్యాచ్‌లో ధోని(91 నాటౌట్: 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ధోని కీలక ఇన్నింగ్స్ వెనుక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాత్ర ఉందట.
సాధారణంగా ధోని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. అయితే వరల్డ్ కప్ ఫైనల్లో ధోని ఒక స్థానం ముందుగా బ్యాటింగ్‌కు దిగాడు. యువరాజ్ సింగ్ రావాల్సిన ఐదో స్థానంలో ధోని బ్యాటింగ్‌కు వచ్చి చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌తో వరల్డ్‌కప్‌ను అందించాడు.
కాగా, ధోనిని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపడానికి సచినే కారణమట. సచినే నేరుగా కలగజేసుకుని బ్యాటింగ్ ఆర‍్డర్‌ను మార్చాడట. ఈ విషయాన్ని వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా స్పష్టం చేశాడు. అలా సచిన్ డైరెక్ట్‌గా ఎంఎస్ ధోనికి చెప్పడం తొలిసారని, అది మంచి ఫలితాన్ని ఇచ్చిందని సెహ్వాగ్ తెలిపాడు. ‘ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ధోనికి సచిన్ సలహా ఇచ్చాడు. అది కూడా గౌతం గంభీర్(97)- విరాట్ కోహ్లి(35) బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ధోనికి సచిన్ ఒక టిప్ చెప్పాడు. అక్కడ ఆడే వాళ్లలో కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన కోహ్లి ఔటైతే, నీవు బ్యాటింగ్‌కు వెళ్లు, అలా కాకుండా ఎడమ చేతి వాటం ఆటగాడైన గంభీర్ ఔటైతే యువరాజ్ సింగ్ వెళతాడు అని సచిన్ చెప్పాడు. ఆ తర్వాత కోహ్లి ఔట్ కావడం, ధోని బ్యాటింగ్‌కు వెళ్లడం జరిగింది’ అని వాట్ ద డక్’షోలో సెహ్వాగ్ తెలిపాడు.
ఆ మ్యాచ్‌లో 275 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగగా సెహ్వాగ్(0), సచిన్(18)లు నిరాశపరిచారు. అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన గౌతం గంభీర్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. కీలక ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకున్నాడు. గౌతీ ఔటయ్యాక యువరాజ్ సింగ్ (21 నాటౌట్) సహకారంతో అప్పటి కెప్టెన్ ధోని మ్యాచ్‌ను విజయతీరాలకు చేర్చాడు. దాంతో 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్ రెండోసారి వరల్డ్‌కప్‌ను ముద్దాడింది.
Comments
Please login to add a commentAdd a comment