
లండన్: ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ ద హండ్రెడ్(వంద బంతుల క్రికెట్)లో మరో ముందడుగు పడింది. కొన్ని రోజుల క్రితం ఆ లీగ్ ప్రారంభం కార్యక్రమాన్ని జరిపిన ఈసీబీ.. తాజాగా అందులో ఆడటానికి మొగ్గుచూపుతున్న క్రికెటర్ల జాబితాను విడుదల చేసింది. మొత్తంగా ఐదు వందలకు పైగా క్రికెటర్లు ద హండ్రెడ్‌లో ఆడటానికి తమ పేర్లను ఇచ్చిన విషయాన్ని ప్రకటించింది.
వీరిలో 239 మంది క్రికెటర్లు విదేశీ క్రికెటర్లేనని తెలిపింది. ఆదివారం నాటి డ్రాఫ్ట్‌లో క్రిస్ గేల్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఉన్న విషయాన్ని పేర్కొంది. అదే సమయంలో 331 మంది స్వదేశీ క్రికెటర్ల జాబితాలో మార్క్‌వుడ్, లియామ్ ప్లంకెట్‌లు ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ తరఫున ఆడుతున్న కాంట్రాక్ట్ ఆటగాళ్లు కూడా ఇందులో కలుస్తారని ఈసీబీ పేర్కొంది. కాకపోతే తమ కనీస ధరలో వార్నర్, స్మిత్, గేల్‌లు అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా తెలిపింది. వీరి రిజర్వ్ ధరను ఈసీబీ స్పష్టం చేయకపోయినప్పటికీ, ఈ ముగ్గురు కనీస ధర ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఆసీస్ నుంచి మిచెల్ స్టార్క్ కూడా ఉన్నప్పటికీ అతని కనీస ధర కోటి యాభై లక్షల రూపాయిలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా ఆటగాళ్ల జాబితాను షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వారిని వేలంలో ఉంచనుంది. ఇక ఈ లీగ్‌లో పాల్గొనే ఎనిమిది జట్లలో ఐదుగురు ఆసీస్ కోచ్‌లే ఉన్నారు. షేన్ వార్న్, డారెన్ లీమన్, టామ్ మూడీలు కోచ్‌లుగా తమ జట్లకు సేవలందించే జాబితాలో ప్రముఖులు. ఇదిలా ఉంచితే, ఏ జట్టు కూడా స్థానిక కోచ్‌ను ఎంపిక చేసుకోకపోవడం గమనార్హం.
క్రికెట్ కొత్త పుంతలు తొక్కించాలనే ప్రయత్నమే ద హండ్రెడ్ రావడానికి కారణం. 2020లో నిర్వహించ తలపెట్టిన 8 జట్ల దేశవాళీ టోర్నీలో వంద బంతుల టోర్నీ నిర్వహించాలని ఈసీబీ నిర్ణయించింది. ఈ మేరకు కొంతకాలం క్రితమే తమ నిర్ణయాన్ని వెల్లడించింది. వంద బంతుల ఫార్మాట్‌లో 15 సాధారణ ఓవర్లు ఉంటే.. ఒక్క ఓవర్లో మాత్రం పది బంతులు ఉంటాయి. ట్వంటీ20 ఫార్మాట్ కన్నా ఇందులో ఓవరాల్‌గా 40 బంతులు తక్కువగా వేస్తారు. దాదాపు రెండున్నర గంటల సమయం తగ్గుతుంది. బంతులు తక్కువగా ఉండటంతో పాటు క్రికెట్ మరింత రసవత్తరంగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment