భారత హాకీ ప్లేయర్‌కు ‘కామన్వెల్త్’ అక్రిడిటేషన్ నిరాకరణ
న్యూఢిల్లీ: ఈ ఏడాది జులైలో స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత హాకీ జట్టు ఆటగాడు హర్బీర్‌సింగ్ సంధూకు నిర్వాహకులు అక్రిడిటేషన్ నిరాకరించారు. అయితే ఇందుకు వారు ఎటువంటి కారణాలూ చూపలేదు. దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హాకీ ఇండియా (హెచ్‌ఐ) అవసరమైతే కామన్వెల్త్ పోటీల నుంచి వైదొలుగుతామంటూ నిరసన తెలిపింది.
ఈ మేరకు హెచ్‌ఐ ప్రధాన కార్యదర్శి నరీందర్ బాత్రా.. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.రామచంద్రన్, రాజీవ్ మెహతాలకు లేఖ రాశారు. 24 ఏళ్ల హర్బీర్ సింగ్‌కు తుదిజట్టులో చోటు దక్కుతుందన్న గ్యారంటీ లేకపోయినా... అక్రిడిటేషన్ నిరాకరించడం భారత్‌కు అవమానకరమని, విషయాన్ని వెంటనే కామన్వెల్త్ క్రీడల నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని, లేదంటే పోటీల నుంచి పురుషుల జట్టును ఉపసంహరించడం మేలని లేఖలో బాత్రా పేర్కొన్నారు.