స్వర్ణ ‘దీక్షా’ మణులు | Golden Girls Of India | Sakshi
Sakshi News home page

స్వర్ణ ‘దీక్షా’ మణులు

Published Fri, Aug 30 2019 11:30 AM | Last Updated on Fri, Aug 30 2019 2:26 PM

Golden Girls Of India - Sakshi

న్యూఢిల్లీ:  అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత కీర్తిని ఎగురవేయడంలో క్రీడాకారిణులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే మీరాబాయి చాను, సంజితా చాను, పూనమ్ యాదవ్, మనూబాకర్, మానికా బాత్రా , హీనా సిద్ధూ మేరీకోమ్, సైనా నెహ్వాల్, తేజస్విని సావంత్, శ్రేయాసి సింగ్‌ ఇలా చాలామంది  ప్రపంచ పటంపై ‘బంగారు’ పతకాలను కొల్లగొట్టిన వారే. ఎన్ని కష్టాలు ఎదురైనా రెట్టించిన ఉత్సాహంతో సాగర కెరటాల్లా ఎగసిపడుతునే ఉన్నారు మన క్రీడా కుసుమాలు.  ఇటీవల బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధూ, షూటర్‌ ఇలవేణి,  పారా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి మానసి జోషిలు భారత కీర్తిని మరింత ఇనుమడింపజేశారు. కొన్ని రోజుల క్రితం తమ విభాగాల్లో సత్తాచాటిన ఈ గోల్డెన్‌ గర్ల్స్‌ గురించి ఒకసారి చూద్దాం.

పీవీ సింధు..

1995, జూలై 5 తేదీని  పి. వి. రమణ, పి. విజయ దంపతులకు సింధు జన్మించారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్‌ ఆడటం ప్రారంభించిన సింధు..  24 ఏళ్ల వయసులోనే ప్రపంచ చాంపియన్‌ అయ్యారు.  వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ ఆరంభంనుంచి ఆఖరు దశకు చేరే వరకు ఎందరో స్టార్లు తలవంచి నిష్క్రమించిన చోట... సింధు మాత్రం ఉవ్వెత్తున ఎగిశారు. వరుసగా మూడుసార్లు ఫైనల్‌కు చేరిన ఈ హైదరాబాదీ అమ్మాయి.. స్వర్ణం ముచ్చటను తీర్చుకున్నారు. ఫలితంగా నాలుగు దశాబ్దాలుగా ఊరించిన పసిడి కల నెరవేరింది. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను అందుకున్నారు సింధు.  

గతంలో పాల్గొన్న ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో నాలుగు పతకాలు గెల్చుకున్న తెలుగు తేజం.. ఈసారి మాత్రం పసిడి సాధించే వరకూ వదల్లేదు. గత ఆదివారం ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ పోరులో సింధు ఏకపక్ష విజయం సాధించి పసిడిని ఒడిసి పట్టుకున్నారు. పీవీ సింధు 21-7, 21-7 తేడాతో జపాన్‌ స్టార్‌ క్రీడాకారిణి ఒకుహారాను మట్టికరిపించి తొలిసారి చాంపియన్‌గా అవతరించారు.

సెప్టెంబరు 21, 2012 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్- 20 జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.  ఆగస్టు 10, 2013 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి అలా గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించారు.

2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో జపాన్ కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించడం ద్వారా ఈ మెగా టోర్నమెంట్‌ బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. ఫైనల్లో పోరాడి ఓడినప్పటికీ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయ క్రీడాకారిణిగా సింధు నిలిచారు. ఓవరాల్‌గా తన కెరీర్‌లో 15 టైటిల్స్‌ సాధించారు. మార్చి 30, 2015న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రదానం చేయగా, అంతకముందు 2013లో అర్జున అవార్డును సింధు అందుకున్నారు. 2016లో భారత దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌ రత్నాతో సింధును సత్కరించారు.

మానసి జోషి..

పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో  మానసి జోషి స్వర్ణం సాధించడం వెనుక పెద్ద కష్టమే ఉంది. రోడ్డు ప్రమాదం కారణంగా ఎడమ కాలును పోగొట్టుకుని ఇక ఆటకు దూరమవుతుందేమో అనుకుంటున్న సమయంలో... అసమాన ప్రతిభ చూపించి పారా ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించారు మానసి. ముంబైలో 2011లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మానసి జోషి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఎముకలు విరిగిపోయాయి. ఎడమకాలు తెగి పడిపోయింది. ప్రమాదం జరిగిన మూడు గంటల తర్వాత ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. 10 గంటలపాటు మానసికి ఆపరేషన్ చేసి చివరికి ప్రాణాలను కాపాడారు. అయితే గ్యాంగ్లిన్ అనే వ్యాధి సోకడంతో ఆమె కాలును తొలగించారు. ఆ విషయం తెలిసిన తర్వాత మానసి.. నాలుగు గోడలకే పరిమితం కావాలని అనుకోలేదు. ప్రమాదం జరిగిన ఏడాది తర్వాత కృత్రిమ కాలుతో నడిచింది. పట్టుదలతో బ్యాడ్మింటన్ కోర్టులోకి దిగింది. స్కోబా డైవింగ్‌లో కూడా మెలకువలు నేర్చుకుంది. 2014లో పారా ఏషియన్ గేమ్స్‌తో అంతర్జాతీయ క్రీడల్లోకి ప్రవేశించారు.

మానసి జోషి 1989 జూన్‌ 11న జన్మించారు. ఆమె తండ్రి బార్క్‌లో మాజీ శాస్త్రవేత్త. 2010లో ముంబయి వర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. అయితే ఆ జీవితంలో అతి పెద్ద కుదుపు రోడ్డు ప్రమాదం. అతి వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు ఆమెను ఢీకొనడంతో జోషి తన ఎడమ కాలును కోల్పోయింది. అయితేనేం పట్టువదలకుండా ఎంతో శ్రమించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు మానసి. 2015లో పారా బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజతం సాధించారు. ఇక 2018లోను పలు టైటిల్స్‌ను అందకున్నారు. అదే ఏడాది జకార్తాలో జరిగిన ఆసియన్‌ పారా గేమ్స్‌లో కాంస్య పతకం సాధించారు మానసి. ఇలా చాంపియన్‌గా ఎదిగి యువతకి స్ఫూర్తిగా నిలిచారు. అదే ఆత్మవిశ్వాసంతో ఆటను కొనసాగించారు. ఈ ఏడాది పారా బ్యాడ్మింటన్ గోల్డ్ ఛాంపియన్ షిప్‌‌లో స్వర్ణాన్ని అందుకున్నారు.

ఇలవేణి

భారత షూటర్‌ ఇలవేణి వలరివన్‌ ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌లో స్వర్ణ పతకంతో మెరిశారు. రియో డి జెనిరో వేదికగా జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఆమె భారత్‌కు పతకాన్ని అందించారు. తద్వారా షూటింగ్‌ ప్రపంచ కప్‌ సిరీస్‌లో ఈ ఘనత సాధించిన(10 మీ ఎయిర్‌ రైఫిల్‌) మూడో మహిళా షూటర్‌గా నిలిచారు. ఈనెలలోనే 20వ వసంతంలో అడుగుపెట్టిన ఈ కడలూరు అమ్మాయి సీనియర్‌ క్రీడాకారిణిగా బరిలో దిగిన రోజే పసిడిని సొంతం చేసుకోవడం విశేషం.తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో 1999, ఆగస్టు 2వ తేదీని జన్మించారు. ఇలవేణి వలరివన్‌ కుటుంబం ఉద్యోగ రీత్యా ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉంటున్నది. తమిళనాట కడలూరు జిల్లాలోనే కాదు, చెన్నైలోనూ ఆ కుటుంబానికి ఆప్తులు ఎక్కువే.

అందుకే తమిళనాడుతోనే ఆ కుటుంబానికి అనుబంధం ఎక్కువ. బ్యాచిలర్‌ ఇన్‌ ఆర్ట్స్‌  చదువుతున్న ఇలవేణికి రైఫిల్‌ షూటింగ్‌లో చిన్నతనం నుంచి మక్కువ ఎక్కువే. తండ్రి వలరివన్‌ ఇచ్చిన ప్రోత్సాహం ఆమెను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. 2018లో సిడ్నీ వేదికగా జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్‌ జూనియర్‌ విభాగంలో ఆమె స్వర్ణం సాధించారు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో పసిడితో మెరిశారు ఇలవేణి. ఇప్పుడు సీనియర్‌ షూటింగ్‌ విభాగంలో  251.7 పాయింట్లు సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. బ్రెజిల్‌ వేదికగా జరిగిన ఈ పోటీల్లో అంచనాలకు తగ్గట్టే రాణించి శభాష్‌ అనిపించారు. సీనియర్‌ షూటర్‌, ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత గగన్‌ నారంగ్‌ వద్ద ఇలవేణి షూటింగ్‌లో మెళకువలు నేర్చుకుని తన గురికి పదును పెట్టుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement