
గుడ్‌బై చెబుతున్నా... రియోలో పాల్గొంటా!
ట్విటర్‌లో షూటర్ అభినవ్ బింద్రా గందరగోళ వ్యాఖ్యలు
ఇంచియాన్: భారత్‌కు చెందిన ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా తన వ్యాఖ్యలతో అయోమయం నెలకొల్పాడు. ప్రస్తుతం ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్న తను నేడు (మంగళవారం) జరిగే 10మీ. రైఫిల్ ఈవెంట్‌లో బరిలోకి దిగనున్నాడు. అయితే ప్రొఫెషనల్ షూటర్‌గా ఇదే తన చివరి రోజు అని ఈ మాజీ ఒలింపిక్ చాంపియన్ ట్వీట్ చేయడం కలకలం రేపింది. అలాగే 2016లో జరిగే రియో ఒలింపిక్స్‌లో చివరిసారి పాల్గొంటానని మరో ట్వీట్ చేయడం గందరగోళానికి దారి తీసింది. ‘నేటి (మంగళవారం)తో నా ప్రొఫెషనల్ షూటింగ్ కెరీర్ ముగుస్తుంది. అయితే నేను షూటింగ్ చేయడాన్ని మానుకోను. వారానికి రెండు రోజులు శిక్షణ తీసుకుంటూ హాబీ షూటర్‌గా పోటీల్లో పాల్గొంటా. అలాగే రియోలో పాల్గొనేందుకు కూడా ప్రయత్నిస్తా. అక్కడ సత్తా నిరూపించుకునేందుకు తగిన అర్హత కూడా ఉంది’ అని ట్విటర్‌లో తెలిపాడు. మొత్తం మీద బింద్రా మనసులో కచ్చితంగా ఏముందనేది నేటి ఈవెంట్ తర్వాత తెలిసే అవకాశం ఉంది.