జులన్ గోస్వామి
కింబర్లే: తాను తీసిన 200 వికెట్లలో ప్రతి వికెటూ ప్రత్యేకమైనదేనని భారత మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి అభిప్రాయపడ్డారు. గత బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఆ జట్టు ఓపెనర్ లూరే వికెట్ తీయడంతో వన్డే క్రికెట్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి మహిళా క్రికెటర్‌గా జులన్ గోస్వామి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జులన్ మాట్లాడుతూ..‘ఇప్పటి వరకు నేను తీసిన ప్రతి వికెట్ నాకు గుర్తుంది. నా తొలి వికెట్ 2002లో ఇంగ్లండ్‌పై సాధించా. చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో కారోలిన్ అట్కిన్స్ గాల్లోకి లేపిన బంతిని మిథాలీరాజ్ క్యాచ్ పట్టింది. ఇప్పటి వరకు నేను సాధించిన ప్రతి వికెట్ నాకు ప్రత్యేకం. నిజానికి ఈ ఘనత సాధించడానికి నాకెక్కువ సమయం పట్టలేదు. అంతకు ముందు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నమోదు చేయడానికి మూడు వికెట్ల దూరంలో నిలిచి చాలా సమయం తీసుకున్నా.’ అని జులన్ తెలిపారు.
రెండో వన్డే విజయంపై..
ఆతిథ్య జట్టుపై వరుసగా రెండో వన్డేలో గెలవడంపై స్పందిస్తూ.. ‘ ఈ విజయం పట్ల గర్వంగా ఉంది. నా సహచర ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో మంధన, హర్మన్, వేద అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. నేను 200 వికెట్ల మైలు రాయిని అందుకున్న మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నా కుటుంబసభ్యులకు, సహచర ఆటగాళ్లకు, కోచ్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మధ్యమధ్యలో గాయాల బారిన పడతాం. ఆటలో ఇవన్నీ మామూలే. సిరీస్‌ల మధ్య రెండు మూడు నెలల విరామం ఉండటంతో గాయాల నుంచి కోలుకుని తిరిగి ఫామ్‌ను అందుకోవడం సులువుగా ఉంటుంది’ అని జులన్ వ్యాఖ్యానించింది.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య చివరి వన్డే శనివారం జరగనుంది. ఇప్పటికే 2-0తో భారత్ సిరీస్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment