'నిజానికి నేను బౌలర్ను కాదు'
కింగ్స్టన్: భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో రాణించిన వెస్టిండీస్ ఏకైక బౌలర్ రోస్టన్ ఛేజ్. విండీస్ స్పిన్నర్ ఛేజ్ 5 వికెట్ల ఇన్నింగ్స్ (5/121) తో ఆకట్టుకున్నాడు. మూడోరోజు మ్యాచ్ ముగిసిన తర్వాత ఛేజ్ మీడియాతో మాట్లాడాడు. భారత్ లాంటి జట్టుపై ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది తనకు మరిచిపోలేని అనుభవమని పేర్కొన్నాడు. తాను పార్ట్ టైం బౌలర్ గా జట్టులోకి వచ్చానని, అయితే తాను ప్రధానంగా బ్యాట్స్ మన్ అని తెలిపాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచులలో పెద్దగా బౌలింగ్ చేసేవాడిని కాదని, అయితే జట్టు అవసరాల మేరకు అక్కడ తన చేతికి బంతిని అందించారని వెల్లడించాడు.
ఆంటిగ్వా టెస్టుతోనే జాతీయ జట్టులో కెరీర్ ప్రారంభించానని, అయితే టెస్టుల్లో రాణించడం అంత సులువుకాదని అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో తాను లైన్ అండ్ లెంగ్త్ పట్టించుకోకుండా కాస్త వేగంగా బంతులు విసిరాను... ఈ టెస్టులో ఆ లోపాలను సవరించుకుని వికెట్లు పడగొట్టానన్నాడు. బంతి వేగాన్ని తగ్గించడంతో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపాడు. 304 పరుగులు వెనుకబడి ఉన్న తమ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో సమిష్టిగా రాణిస్తేనే మ్యాచ్ ఫలితాన్ని మార్చగలడం సాధ్యమవుతుందని స్పిన్నర్ రోస్టన్ ఛేజ్ అభిప్రాయపడ్డాడు.