విండీస్ బ్యాట్స్మన్ సూపర్ : కుంబ్లే
కింగ్స్టన్: భారత్తో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ అద్భుత సెంచరీ(137 నాటౌట్) ఇన్నింగ్స్ ను టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే ప్రశంసించాడు. ఛేజ్ ఇన్నింగ్స్ కారణంగా రెండో టెస్టు బుధవారం డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. టెస్టులో 100 ఓవర్లకు పైగా కోల్పోవడంతో మ్యాచ్ డ్రా దిశగా సాగిందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. 2-0 ఆధిక్యంలో నిలుస్తామని భావించినా.. విండీస్ మిడిల్, లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు డౌరిచ్, జాసన్ హోల్డర్ హాఫ్ సెంచరీలు చేసి ఛేజ్ తో కలిసి స్కోరు బోర్డుకు పరుగులు జతచేయడంతో మ్యాచ్ ఫలితం మారిపోయిందన్నాడు.
'మా జట్టు 304 పరుగుల ఆధిక్యంలో ఉంది. అప్పుడు రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విండీస్ కేవలం 50 పరుగుల లోపే 4 కీలక వికెట్లు కోల్పోయింది. అయినా విండీస్ ఆటగాళ్లు సమయోచితంగా రాణించారు. వారి ఆటతీరును నిజంగానే మెచ్చుకుని తీరాల్సిందే. కచ్చితంగా గెలుస్తామన్న మ్యాచ్ను డ్రాగా ముగించారంటే ఈ క్రెడిట్ విండీస్ బ్యాట్స్మన్కే చెందుతోంది. ఆంటిగ్వా టెస్టుతో పోల్చితే రన్ రేట్ ఇక్కడ చాలా తక్కువగా నమోదైంది' అని భారత కోచ్ కుంబ్లే వివరించాడు.