నాకు నేనే పోటీ
న్యూఢిల్లీ: విదేశీ పర్యటనల్లో స్పిన్నర్ అశ్విన్ పూర్తిగా విఫలమవుతుండడం... జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న హర్భజన్ సింగ్‌కు మంచి అవకాశమని విమర్శకుల భావన. మాజీ స్పిన్నర్లు మణీందర్ సింగ్, నరేంద్ర హిర్వాణీతో పాటు సౌరవ్ గంగూలీ కూడా ఇదే డిమాండ్‌ను తెర మీదికి తెచ్చారు. అయితే జట్టులో చోటు కోసం ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదని భజ్జీ అంటున్నాడు. తనకు తానే పోటీ అనే ధీమాతో ఉన్న హర్భజన్.. ఫామ్‌పై, జట్టులో చోటుపై చెప్పిన వివరాలు అతని మాటల్లోనే...
ఇన్నేళ్ల నా కెరీర్‌లో నేను ఒకరితోనే పోటీపడ్డాను. అది నాతోనే. అశ్విన్‌తో కానీ మరొకరితో కానీ పోటీ పడడానికి ఇష్టపడను.
అంతర్జాతీయ కెరీర్ అనేది ఒంటరి ప్రయాణం. ఇక్కడ ఎవరితో వారే పోటీపడుతూ క్రికెటర్‌గా ఎదుగుతుండాలి. విఫలమవుతున్న అశ్విన్ గురించి ఒక్క వాక్యం కూడా నేను మాట్లాడను.
నాకిప్పుడు 33 ఏళ్లు. జట్టులో స్థానం కోసం నేనేమీ గడువు నిర్ణయించుకోలేదు. వయస్సు అనేది సంఖ్య మాత్రమే. 45 ఏళ్ల వయస్సులో ఓ ఆటగాడు అద్భుత ప్రదర్శన ఇస్తే అతడిని ఆపేవారెవరు?
భారత్‌కు ఆడడాన్ని ఆస్వాదించినంత వరకు ఆడతాను. అయితే 100 టెస్టులకు పైగా ఆడిన అనంతరం రెగ్యులర్‌గా దేశవాళీల్లో పాల్గొనడం కొంచెం కష్టమే. కానీ వ్యతిరేక పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచినప్పుడే మన సత్తా బయటపడుతుంది.
ఇలాంటి గడ్డు స్థితిని గతంలోనూ చాలా మంది ఎదుర్కొన్నారు. ఇక జట్టులోకి వచ్చే విషయం పూర్తిగా సెలక్లర్లపై ఆధారపడి ఉంటుంది.
జట్టులో చోటు కోల్పోయిన తర్వాత గత ఏడాది కాలంగా దేశవాళీల్లో బాగానే రాణించాను.
ఇక ఎన్నికల్లో పోటీ చేయాలని చాలా మంది సీనియర్ నాయకులు నన్ను కలిశారు. కానీ ప్రతి పనికీ ఓ సమయమంటూ ఉంటుంది. ప్రస్తుతం నా దృష్టంతా క్రికెట్‌పైనే.