
టైటిల్‌కు చేరువలో హారిక
కెరీర్‌లో తొలి గ్రాండ్‌ప్రి సిరీస్ టైటిల్ సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మరింత చేరువైంది.
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్
చెంగ్డూ (చైనా): కెరీర్‌లో తొలి గ్రాండ్‌ప్రి సిరీస్ టైటిల్ సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మరింత చేరువైంది. చైనాలో జరుగుతున్న ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో పదో రౌండ్ ముగిశాక హారిక 6.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన కోనేరు హంపి, ప్రపంచ మాజీ చాంపియన్ అంటోనెటా స్టెఫనోవా (బల్గేరియా) 6 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. జావో జుయ్ (చైనా)తో బుధవారం జరిగిన పదో రౌండ్ గేమ్‌ను హారిక 34 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ప్రపంచ మాజీ చాంపియన్ మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో జరిగిన గేమ్‌లో హంపి నల్లపావులతో ఆడుతూ 37 ఎత్తుల్లో సంచలన విజయం సాధించింది.
గురువారం జరిగే చివరిదైన 11వ రౌండ్ గేముల్లో గిర్యా ఓల్గా (రష్యా)తో హారిక... స్టెఫనోవాతో హంపి తలపడతారు. గిర్యా ఓల్గాపై హారిక గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా టైటిల్‌ను సొంతం చేసుకుంటుంది. హంపి, స్టెఫనోవా మధ్య గేమ్ ‘డ్రా’గా ముగిస్తే... హారిక కూడా తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంటే ఆమెకే టైటిల్ లభిస్తుంది. ఒకవేళ హంపి లేదా స్టెఫనోవాలలో ఒకరు గెలిచి, హారిక గేమ్ కూడా ‘డ్రా’ అయితే ఇద్దరు ఏడు పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తారు. అపుడు మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు.
హరికృష్ణకు మరో ‘డ్రా’: చైనాలోనే జరుగుతున్న సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నమెంట్‌లో పెంటేల హరికృష్ణ నాలుగో ‘డ్రా’ నమోదు చేశాడు. పీటర్ లెకో (హంగేరి)తో జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను 47 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.