
బీల్ చెస్ టోర్నీ: రన్నరప్ హరికృష్ణ
అంతర్జాతీయ వేదికపై భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మరోసారి మెరిశాడు.
హైదరాబాద్: అంతర్జాతీయ వేదికపై భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మరోసారి మెరిశాడు. ఇటీవలే జెనీవా ‘ఫిడే’ గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీలో నాలుగో స్థానం పొందిన ఈ తెలుగు తేజం... స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న బీల్ ఓపెన్ చెస్ ఫెస్టివల్ టోర్నీలో ర్యాపిడ్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో హరికృష్ణకు రెండో స్థానం లభించింది.
క్వార్టర్ ఫైనల్లో హరికృష్ణ 1.5–0.5తో వ్లాస్తిమిల్ హోర్ట్ (జర్మనీ)పై నెగ్గగా... సెమీఫైనల్లో 2–0తో యానిక్ పెలెటీర్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. ఫైనల్లో హరికృష్ణ 0.5–1.5తో డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. ఇదే టోర్నీలో 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య క్లాసిక్ విభాగంలో టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. తొలి రౌండ్‌లో రాఫెల్ వగానియాన్ (అర్మేనియా)తో జరిగిన గేమ్‌ను హరికృష్ణ 21 ఎత్తుల్లో డ్రా చేసుకున్నాడు.