హరికృష్ణ, నాడ్జ స్టొయానొవిక్
అరవై నాలుగు గడుల ఆటలో వారి ప్రేమ తొలి అడుగు వేసింది. ఇప్పుడు ఆ బంధం బలపడి ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. ఒకరి ఎత్తుకు మరొకరు పైఎత్తులు వేసే చదరంగం ఆడుతూనే వారిద్దరు ఒకరి ప్రేమకు మరొకరు చిత్తయ్యారు. దేశం వేరు, సంస్కృతి వేరు. కానీ ఆటతో మొదలైన పరిచయం జీవితకాలపు అనుబంధంగా మారేందుకు మాత్రం అలాంటివేమీ హద్దుగా మారలేదు. భాగ్యనగరానికి, బెల్‌గ్రేడ్‌కు మధ్య ఉన్న ఆరు వేల మైళ్ల దూరాన్ని చెరిపేస్తూ వారిద్దరు పరిణయంతో ఒకటి కాబోతున్నారు. భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) తెలుగు తేజం పెంటేల హరికృష్ణ, సెర్బియా క్రీడాకారిణి నాడ్జ స్టొయానొవిక్ మధ్య సాగిన ప్రేమ కథ ఇది. భారత్‌కు చెందిన ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడు విదేశీ వనితను వివాహమాడటం ఇటీవలి కాలంలో ఇదే కావడం విశేషం.
సాక్షి, హైదరాబాద్: చెస్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మార్చి 3న వివాహం చేసుకోబోతున్నాడు. వధువు సెర్బియా దేశానికి చెందిన నాడ్జ స్టొయానొవిక్. హరికృష్ణ 2745 రేటింగ్‌తో ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్నాడు. నాడ్జ గతంలో సెర్బియా జాతీయ జూనియర్ చెస్ చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత యూరోపియన్ చెస్ యూనియన్‌లో ఆర్బిటర్, మీడియా మేనేజర్‌గా పని చేస్తోంది. చెస్ సర్క్యూట్‌లో మొదలైన వీరిద్దరి పరిచయం ఇప్పుడు పెళ్లి దాకా చేరింది. ఈ నేపథ్యంలో తమ ప్రేమ వివాహం గురించి ‘సాక్షి’తో హరికృష్ణ స్వయంగా చెప్పిన విశేషాలు అతని మాటల్లోనే...
‘చెస్ క్రీడాకారుడిగా ప్రపంచ వ్యాప్తంగా అనేక పెద్దా, చిన్నా టోర్నీలలో నేను పాల్గొంటుంటాను. సాధారణంగా యూరప్ కేంద్రంగా చుట్టుపక్కల ఉండే దేశాల్లోనే ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొంత మందిని తరచుగా కలవడం, వారిలో కొందరు ఆత్మీయ స్నేహితులుగా మారిపోవడం సహజం. ఈ తరహాలో చెస్ సర్క్యూట్‌లో కలిగిన పరిచయం తెలుగు కుర్రాడినైన నా పెళ్లి ఒక సెర్బియా అమ్మాయితో జరగడం వరకు వెళుతుందని అసలు ఎప్పుడూ ఊహించలేదు.
ఉమెన్ ఫిడే మాస్టర్ (డబ్ల్యూఎఫ్‌ఎం) అయిన నాడ్జ యుగొస్లేవియా దేశంగా ఉన్నప్పుడు జాతీయ జూనియర్ చాంపియన్‌గా నిలిచింది. దాదాపు ఏడేళ్ల క్రితం మేమిద్దరం తొలిసారి పరిచయమయ్యాం. అయితే ఆ తర్వాత మేం పెద్దగా కలుసుకోలేదు. కొంత విరామం వచ్చేసింది. నిజంగా ప్రేమ మొదలైంది మాత్రం దాదాపు రెండేళ్ల క్రితమే. ఆ సమయంలోనే ఒకరి గురించి మరొకరం బాగా తెలుసుకున్నాం. చెస్ గురించి మాట్లాడటం మొదలు పెట్టి ఇష్టా ఇష్టాల వరకు వెళ్లడంతో తెలీకుండానే దగ్గరయ్యాం. నాడ్జకు ప్రయాణాలు చేయడం, కొత్త సంస్కృతులు గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం. అదే క్రమంలో ఆమె అప్పటికీ భారత్ గురించి చాలా చదివేసింది. ఇది కూడా నాకు కలిసొచ్చింది. దాంతో ఆమెతో స్నేహంతోనే ఆగిపోకుండా మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకొని నేనే పెళ్లి గురించి ప్రతిపాదించాను. ఆమె వెంటనే ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. తల్లిదండ్రులతో చర్చించి కొన్ని నెలల తర్వాత ఓకే చెప్పింది. అప్పుడు నేను మా అమ్మానాన్నలతో ఈ విషయం చెప్పాను. సహజంగానే వెంటనే ఆమోదం ఏమీ లభించలేదు. జీవన శైలి, ఇతర సంప్రదాయాల గురించి వారు బాగా ఆలోచిస్తారు కాబట్టి ఎలాంటి నిర్ణయానికి రాలేదు. దాంతో మెల్లిగా ఒప్పించే ప్రయత్నం చేశాను. సరిగ్గా చెప్పాలంటే నా ప్రయత్నంకంటే కాలమే వారు అంగీకరించేలా చేసింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత నా పెళ్లికి వారు ఒప్పుకున్నారు.
నాడ్జ ఆ తర్వాత మా అమ్మా నాన్నలతో మాట్లాడటం, ఇక్కడి విషయాలు, తెలుగు సంస్కృతి గురించి అన్నీ తెలుసుకోవడం జరుగుతూ పోయింది. మన పెళ్లి వీడియోలు కొన్ని చూపించి సంప్రదాయాల గురించి వివరించాను. అంతా కుదురుతున్న తర్వాతే పెళ్లి తేదీని ఖరారు చేశారు. హైదరాబాద్‌లో పెళ్లికి ఆమె తల్లి, సోదరుడు, చెల్లితో పాటు కొందరు ఫ్రెండ్స్ వస్తున్నారు. అనారోగ్యంతో తండ్రి మాత్రం రావడం లేదు. చెస్ ప్రపంచంలో దాదాపు అందరికీ మా ప్రేమ గురించి తెలుసు. వారంతా మమ్మల్ని ప్రత్యేకంగా అభినందించారు. టోర్నీ కారణంగా విశ్వనాథన్ ఆనంద్ పెళ్లికి రాలేకపోతున్నా... ఆయన సతీమణి అరుణ మాత్రం వస్తున్నారు. అనేక మంది భారత, విదేశీ చెస్ ఆటగాళ్లు కూడా హాజరవుతున్నారు. పెళ్లి తర్వాత సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో విందు జరిగే అవకాశం ఉంది. తరచుగా టోర్నీల్లో పాల్గొనడం కోసం నేను ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. వివాహానంతరం అక్కడికే వెళ్లిపోతాను. నాడ్జ ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటోంది. కలిసి చాలా తెలుగు సినిమాలు చూశాం. ఆమెకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. ఇష్టపడిన వ్యక్తితో నా ప్రేమ చివరకు పెళ్లి దాకా చేరడం చాలా సంతోషంగా ఉంది.’
Comments
Please login to add a commentAdd a comment