తొలి అడ్డంకి దాటారు
సైనా, సింధు శుభారంభం
ఒడెన్స్: సింగిల్స్‌లో సంతోషం... డబుల్స్‌లో నిరాశ... డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తొలి రోజు భారత ప్రదర్శన ఇది. సైనా నెహ్వాల్, పి.వి.సింధు, పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్ తొలి రౌండ్ అడ్డంకిని విజయవంతంగా అధిగమించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించగా... మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం; మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా) జోడీ మాత్రం తొలి రౌండ్‌లో ఓడిపోయాయి.
ఆసియా క్రీడల తర్వాత బరిలోకి దిగుతోన్న తొలి టోర్నమెంట్‌లో శుభారంభం చేయడానికి సైనా నెహ్వాల్ తీవ్రంగా శ్రమించగా... సింధు అలవోక విజయం సాధించింది. ఏడో సీడ్ సైనా 12-21, 21-10, 21-12తో కరీన్ షానాస్ (జర్మనీ)పై, సింధు 21-13, 22-20తో పుయ్ యిన్ యిప్ (హాంకాంగ్)పై నెగ్గారు. పురుషుల సింగిల్స్‌లో కశ్యప్ 21-15, 21-18తో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)పై, శ్రీకాంత్ 21-15, 17-21, 21-18తో జుయ్ సాంగ్ (చైనా)పై గెలిచారు. నిర్ణాయక చివరి గేమ్‌లో 16-18తో వెనుకబడిన దశలో శ్రీకాంత్ అనూహ్యంగా పుంజుకొని వరుసగా ఐదు పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడీ 17-21, 15-21తో ఎఫ్జీ ముస్కెన్స్-సెలెనా పీక్ (నెదర్లాండ్స్) చేతిలో; మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-ఇవనోవ్ 18-21, 18-21తో యున్ లంగ్ లాన్-యింగ్ సుయెట్ సె (హాంకాంగ్) చేతిలో ఓడిపోయారు.