
కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ఆమ్లా
దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ రెండో టెస్టు డ్రా
కేప్‌టౌన్: దాదాపు ఏడాదిన్నర క్రితం దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన హషీం ఆమ్లా అనూహ్యంగా రాజీనామా చేశాడు. ఇంగ్లండ్‌తో బుధవారం ముగిసిన రెండో టెస్టు అనంతరం అతను ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇటీవల భారత్‌తో ఘోర పరాజయం ఎదురుకావడం... ఇంగ్లండ్‌తో స్వదేశంలో సిరీస్‌లోనూ తన నిర్ణయాలపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్రేమ్ స్మిత్ వారసుడిగా పగ్గాలు స్వీకరించిన ఆమ్లా తన తొలి మూడు సిరీస్‌లలో (శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్) జట్టుకు విజయం అందించగా, ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో సిరీస్ వర్షం కారణంగా ఫలితం తేలలేదు.
భారత్‌లో నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో జట్టు 0-3తో చిత్తుగా ఓడింది. సొంతగడ్డపై కూడా ఇంగ్లండ్ చేతిలో తొలి టెస్టులో ఘోరంగా ఓడింది. రెండో టెస్టులో తన డబుల్ సెంచరీతో జట్టును ఆదుకున్నా... కెప్టెన్సీకి మాత్రం ఆమ్లా గుడ్‌బై చెప్పాడు. ఈ సిరీస్‌లో అతని వ్యూహాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘నా ఆటపై దృష్టి పెట్టేందుకు ఎంతో కష్టంగా అనిపించినా సరే ఈ నిర్ణయం తీసుకున్నా. నాకంటే మెరుగ్గా కెప్టెన్సీ చేసేవారు ఉన్నారనే నమ్మకం ఉంది’ అని ఆమ్లా చెప్పాడు. సిరీస్‌లో మిగతా రెండు టెస్టులకు డివిలియర్స్ నాయకత్వం వహిస్తాడు.
ఆదుకున్న బెయిర్‌స్టో
చివరి రోజు కాస్త ఉత్కంఠ రేపినా... ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు డ్రాగానే ముగిసింది. మ్యాచ్ ముగిసే సరికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 116 పరుగుల వద్దే జట్టు ఆరో వికెట్ కోల్పోయినా... బెయిర్ స్టో (30 నాటౌట్), అలీ (10 నాటౌట్) కలిసి మరో 23.4 ఓవర్లు ఆడారు. వెలుతురు మందగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను ముం దే నిలిపేశారు. సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉంది. మూడో టెస్టు 14 నుంచి జరుగుతుంది.