టీమిండియా తక్కువ స్కోరుకు ఆలౌటయినా..
నాగపూర్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు బౌలర్ల హవా కొనసాగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ను దక్షిణాఫ్రికా బౌలర్లు 215 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసేసరికి కేవలం 11 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఇరు జట్లలో బౌలర్లు మొత్తం 12 వికెట్లు తీశారు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే ఆలౌటయినా.. దక్షిణాఫ్రికా వికెట్లు రెండు పడగొట్టి మ్యాచ్ పై పట్టు చేజారకుండా కాపాడుకుంది. మ్యాచ్ రెండో రోజు భారత బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే సౌతాఫ్రికాకు కష్టాలు తప్పకపోవచ్చు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 పరుగుల వరకు వికెట్లు కోల్పోకుండా నిలకడగా ఆడుతున్నట్టు కనిపించింది. కానీ ధావన్ వికెట్ కోల్పోయిన అనంతరం వరుసగా వికెట్లను కోల్పోతూ 215 పరుగుకే ఆలౌటైంది. మురళీ విజయ్(40), జడేజా(34), సాహా(32) పరుగులు చేసి టాప్ స్కోరర్లు గా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్ 4, మోర్కెల్ 3 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే వాన్ జిల్, తాహిర్ వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో అశ్విన్, జడేజాలకు చెరో వికెట్ తీశారు.