పట్టు చిక్క లేదు!
రెండో రోజు ఆట సమం
ఆస్ట్రేలియా 221/4
రాణించిన స్మిత్, రోజర్స్
ఉమేశ్‌కు 3 వికెట్లు
భారత్ 408 ఆలౌట్
బ్రిస్బేన్: రెండో టెస్టు మ్యాచ్‌లో ఆధిక్యం కోసం భారత్, ఆస్ట్రేలియా తీవ్రంగా పోరాడుతున్నాయి. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను తొందరగానే ముగించగలిగిన ఆసీస్, ఆ తర్వాత నాలుగు వికెట్లు కోల్పోయి ఆత్మరక్షణలో పడింది. మ్యాచ్ రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 52 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (88 బంతుల్లో 65 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), క్రిస్ రోజర్స్ (79 బంతుల్లో 55; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మరో 187 పరుగులు వెనుకబడి ఉంది.
స్మిత్‌తో పాటు మిషెల్ మార్ష్ (7 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌కు 3 వికెట్లు దక్కగా, అశ్విన్ మరో వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో మూడో రోజు శుక్రవారం ఆట కీలకం కానుంది. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 109.4 ఓవర్లలో 408 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు సాధించలేకపోయారు. తొలి టెస్టు ఆడుతున్న జోష్ హాజల్‌వుడ్ (5/68) ఐదు వికెట్లు పడగొట్టగా, కీపర్ హాడిన్ ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లతో ఆసీస్ రికార్డు సమం చేశాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) లయోన్ 144; ధావన్ (సి) హాడిన్ (బి) మిషెల్ మార్ష్ 24; పుజారా (సి) హాడిన్ (బి) హాజల్‌వుడ్ 18; కోహ్లి(సి) హాడిన్ (బి) హాజల్‌వుడ్ 19; రహానే (సి) హాడిన్ (బి) హాజల్‌వుడ్ 81; రోహిత్ (సి) స్మిత్ (బి) వాట్సన్ 32; ధోని (సి) హాడిన్ (బి) హాజల్‌వుడ్ 33; అశ్విన్ (సి) వాట్సన్ (బి) హాజల్‌వుడ్ 35; ఉమేశ్ (సి) రోజర్స్ (బి) లయోన్ 9; ఆరోన్ (సి) (సబ్) లాబషాన్ (బి) లయోన్ 4; ఇషాంత్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (109.4 ఓవర్లలో ఆలౌట్) 408
వికెట్ల పతనం: 1-56; 2-100; 3-137; 4-261; 5-321;6-328;7-385; 8-394; 9-407; 10-408.
బౌలింగ్: జాన్సన్ 21-4-81-0; హాజల్‌వుడ్ 23.2-6-68-5; స్టార్క్ 17-1-83-0; మిషెల్ మార్ష్ 6-1-14-1; లయోన్ 25.4-2-105-3; వాట్సన్ 14.4-6-39-1; వార్నర్ 1-0-9-0; స్మిత్ 1-0-4-0.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: రోజర్స్ (సి) ధోని (బి) ఉమేశ్ 55; వార్నర్ (సి) అశ్విన్ (బి) ఉమేశ్ 29; వాట్సన్ (సి) ధావన్ (బి) అశ్విన్ 25; స్మిత్ (బ్యాటింగ్) 65; షాన్ మార్ష్ (సి) అశ్విన్ (బి) ఉమేశ్ 32; మిషెల్ మార్ష్ (బ్యాటింగ్) 7; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (52 ఓవర్లలో 4 వికెట్లకు) 221
వికెట్ల పతనం: 1-47; 2-98; 3-121; 4-208.
బౌలింగ్: ఇషాంత్ 9-0-47-0; ఆరోన్ 12-1-59-0; ఉమేశ్ 13-2-48-3; అశ్విన్ 18-3-66-1.
వెల్‌డన్:
మూడు కీలక వికెట్లు తీయడంతోపాటు ఈ మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన బంతి (147.8 కిమీ/గం.) విసిరిన భారత బౌలర్ ఉమేశ్ యాదవ్
చేతిలో ఆరు వికెట్లు... ఒక భారీ భాగస్వామ్యం నెలకొల్పినా మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసేది. కానీ కొత్త కుర్రాడు హాజల్‌వుడ్ దెబ్బ తీశాడు. మన ముగ్గురు ఆటగాళ్లు 30లు దాటినా ఒక్కరూ వాటిని భారీ స్కోరుగా మలచలేకపోయారు. ఫలితంగా ఓవర్‌నైట్ స్కోరుకు అదనంగా 97 పరుగులతోనే సరిపెట్టేశారు.
ఆసీస్‌దీ దాదాపు అదే పరిస్థితి. శుభారంభాలు చేసినా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు నిలబడలేకపోయారు. రెండేళ్ల తర్వాత టెస్టు ఆడుతున్న ఉమేశ్ యాదవ్ తన పేస్ పదునేమిటో చూపించి భారత్‌ను మళ్లీ ముందు నిలిపాడు. మిషెల్ జాన్సన్‌ను మించిన వేగంతో బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు.
మొత్తానికి రెండో రోజు ఆటలో ఇరు జట్లు ఒకరిపై మరొకరు ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేసినా... ఎవరికీ మ్యాచ్‌పై పట్టు చిక్కలేదు. ప్రస్తుతం టీమిండియా ముందంజలోనే ఉన్నట్లు కనిపిస్తున్నా... అటువైపు స్మిత్ అడ్డుగోడలా గట్టిగా నిలబడ్డాడు. వారి చేతిలోనూ ఆరు వికెట్లు ఉన్నాయి. కాబట్టి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించాలంటే మూడో రోజు ధోని సేన కాస్త శ్రమించాల్సిందే.
సెషన్-1 ముగిసిన ఇన్నింగ్స్
చేతిలో ఉన్న ఆరు వికెట్లతో రెండో రోజు భారత్ భారీ స్కోరు చేస్తుందని ఆశించినా... హాజల్‌వుడ్ చెలరేగడంతో అది సాధ్యం కాలేదు. ఓవర్‌నైట్ స్కోరు 311/4తో భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. అయితే మరో ఆరు పరుగులు మాత్రమే జత చేసి మూడో ఓవర్లోనే రహానే (81) వెనుదిరిగాడు.
ఆ వెంటనే రోహిత్ శర్మ (32) కూడా అవుటయ్యాడు. ఈ దశలో జత కలిసిన ధోని (53 బంతుల్లో 33; 4 ఫోర్లు), అశ్విన్ (41 బంతుల్లో 35; 6 ఫోర్లు) ధాటిగా ఆడేందుకు ప్రయత్నించారు. స్టార్క్ బౌలింగ్‌లోనే అశ్విన్ మూడు ఫోర్లు బాదగా, ధోని కూడా రెండు ఫోర్లు కొట్టాడు. ఏడో వికెట్‌కు వీరిద్దరు 11.1 ఓవర్లలో 57 పరుగులు జోడించడం విశేషం. అయితే 9 పరుగుల వ్యవధిలో హాజల్‌వుడ్ వీరిద్దరిని పెవిలియన్ పంపించగా... ఆ తర్వాతి రెండు వికెట్లు లయోన్ తీయడంతో జట్టు ఇన్నింగ్స్ ముగిసింది.
ఓవర్లు: 26.4, పరుగులు: 97, వికెట్లు: 6
సెషన్-2 ఉమేశ్ జోరు
తమ ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్ (28 బంతుల్లో 29; 6 ఫోర్లు), రోజర్స్ ధాటిగా ఆరంభించారు. ఉమేశ్ ఆకట్టుకున్నా... ఇషాంత్, ఆరోన్‌ల బౌలింగ్‌లో బ్యాట్స్‌మెన్ పరుగులు రాబట్టారు. ఇషాంత్ ఓవర్లో వార్నర్, ఆరోన్ ఓవర్లో రోజర్స్ మూడేసి ఫోర్లు కొట్టడం విశేషం. అయితే వార్నర్‌ను అవుట్ చేసి ఉమేశ్ జట్టుకు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో అంచనా తప్పి వాట్సన్ (29 బంతుల్లో 25; 4 ఫోర్లు) కూడా వెనుదిరిగాడు. మరోవైపు 73 బంతుల్లో రోజర్స్ అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే మరో చక్కటి బంతితో ఉమేశ్, అతడిని పెవిలియన్ పంపించాడు.
ఓవర్లు: 24.5, పరుగులు: 121, వికెట్లు: 3
సెషన్-3 స్మిత్ దూకుడు
విరామం తర్వాత కెప్టెన్ స్మిత్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా అశ్విన్ వేసిన ఒక ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్‌తో 16 పరుగులు రాబట్టాడు. ఇదే క్రమంలో 68 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరోవైపు షాన్ మార్ష్ (70 బంతుల్లో 32; 5 ఫోర్లు) కాస్త తడబడుతూ ఇన్నింగ్స్ సాగించాడు. 32 పరుగుల వద్ద అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను రహానే వదిలేశాడు. అయితే అదే స్కోరు వద్ద ఉమేశ్ బౌలింగ్‌లో స్లిప్‌లో అశ్విన్ అద్భుత క్యాచ్‌తో మార్ష్ వెనుదిరిగాడు. మరో ఐదు ఓవర్ల తర్వాత వెలుతురు తగ్గడంతో స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాలని అంపైర్లు చేసిన ప్రతిపాదనకు ధోని తిరస్కరించడంతో రెండో రోజు ఆట ముగిసింది.
ఓవర్లు: 27.1, పరుగులు: 100, వికెట్లు: 1
మేం తొలి ఇన్నింగ్స్‌లో మరికొన్ని పరుగులు చేయాల్సింది. అప్పుడు పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేది. చాలా రోజుల తర్వాత బ్యాటింగ్‌కు అవకాశం వచ్చినా... నేను అవుట్ అయిన తీరు పట్ల కూడా నిరాశ చెందాను. ప్రస్తుతం మ్యాచ్‌లో మేం ముందంజలో ఉన్నాం. మూడో రోజు తొలి సెషన్‌లో బాగా ఆడితే మ్యాచ్‌పై పట్టు దొరుకుతుంది. ఆర్డర్‌తో సంబంధం లేకుండా ప్రతీ బ్యాట్స్‌మన్ వికెట్ మాకు కీలకమే. స్మిత్ నా బౌలింగ్‌లో కాస్త దూకుడుగా ఆడాడు. రేపు నా వంతు వస్తుందేమో
- అశ్విన్, భారత బౌలర్
అంపైర్‌తో ధోని వాగ్వాదం
తొలి టెస్టు నుంచీ ఈ సిరీస్‌లో అంపైర్ల నిర్ణయాలపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా రెండో రోజు ఆటలో అంపైర్ ఎరాస్మస్ నిర్ణయం భారత కెప్టెన్ ధోనికి ఆగ్రహం తెప్పించింది. ధోని స్కోరు సున్నా వద్ద జాన్సన్ అతనికి షార్ట్ బంతి విసిరాడు. అయితే దానిని తప్పించుకునే క్రమంలో అతను వికెట్లకు అడ్డంగా జరగ్గా... బంతి ధోని వీపునకు తగిలి ఫైన్ లెగ్ వైపు వెళ్లింది.
దాంతో లెగ్‌బైగా భావించి మహి, రోహిత్ పరుగు ప్రారంభించారు. ఫీల్డర్ బంతి విసిరేలోగా ధోని మూడు పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే పరుగు ఇవ్వకుండా ఎరాస్మస్ దానిని డెడ్‌బాల్‌గా ప్రకటించడంతో భారత కెప్టెన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ధోని షాట్‌కు ప్రయత్నించలేదని అంపైర్ భావించడం దీనికి కారణం కావచ్చు. దీనిపై తీవ్ర అసంతృప్తితో ధోని వాదనకు దిగాడు. సుదీర్ఘ వివరణ తర్వాత వివాదం ముగిసినా ధోని తన అసంతృప్తిని మాత్రం దాచుకోలేకపోయాడు.
సబ్‌స్టిట్యూట్ క్యాచ్...
సాధారణంగా మ్యాచ్‌లో 12వ ఆటగాడు సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగుతుంటాడు. మరొకరి అవసరం ఉంటే ఆ జట్టు సభ్యుడు ఎవరైనా మైదానంలోకి వస్తారు. కానీ ఆసీస్ 12 మంది సభ్యుల జట్టునే బ్రిస్బేన్‌లో ఉంచింది. తొలి రోజు అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ఏకంగా ముగ్గురు బయటి వ్యక్తులు సబ్‌స్టిట్యూట్‌లుగా ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది.
క్వీన్స్‌లాండ్ ఓపెనర్ మార్నస్ లాబషాన్, రాష్ట్ర జట్టు సెకండ్ ఎలెవన్ ప్లేయర్ ఆండ్రూ గోడ్, అండర్-19 ఆటగాడు స్యామ్ హీజ్‌లెట్ ఇలా బరిలోకి దిగారు. రెండో రోజు చివర్లో లయోన్ బౌలింగ్‌లో ఆరోన్ క్యాచ్‌ను షార్ట్‌లెగ్‌లో లాబషాన్ అద్భుతంగా అందుకున్నాడు. అయితే బంతి ఆరోన్ బ్యాట్‌కు తగల్లేదని రీప్లేలో తేలింది. అంతర్జాతీయ జట్టులో స్థానం లేకపోయినా లాబషాన్ క్యాచ్‌ను మాత్రం తన ఖాతాలో వేసుకోవడం విశేషం.
ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు అందుకొని బ్రాడ్ హాడిన్ ఆస్ట్రేలియా రికార్డును సమం చేశాడు. గతంలో మరో ముగ్గురు ఈ ఘనతను సాధించారు. ఓవరాల్‌గా ఒకే ఇన్నింగ్స్‌లో 7 క్యాచ్‌ల రికార్డు వసీమ్ బారి, బాబ్ టేలర్, ఇయాన్ స్మిత్, రిడ్లే జాకబ్స్ పేరిట ఉంది.
అన్ని ఫార్మాట్‌లలో కలిపి అత్యధిక వికెట్లలో భాగస్వామి (క్యాచ్‌లు, స్టంపింగ్‌లు) జాబితాలో హీలీని దాటి ధోని నాలుగో స్థానానికి (మొత్తం 629) చేరుకున్నాడు. బౌచర్, గిల్‌క్రిస్ట్, సంగక్కర ముందున్నారు.
భారత్‌పై తొలి టెస్టులోనే 5 వికెట్లు తీసిన మూడో ఆసీస్ బౌలర్ హాజల్‌వుడ్.
నాయకత్వం వహిస్తున్న తొలి టెస్టులోనే ఆస్ట్రేలియా కెప్టెన్ కనీసం అర్ధ సెంచరీ చేయడం 1978 తర్వాత ఇదే తొలిసారి. స్మిత్ ఇప్పుడు ఆ ఘనత సాధించాడు.