ముంబై: ట్యాంపరింగ్ వివాదంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు దూరమైన స్టీవ్ స్మిత్ స్థానాన్ని దక్షిణాఫ్రికా హార్డ్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్‌తో భర్తీ చేసుకుంది రాజస్తాన్ రాయల్స్. ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో అసాధారణ హిట్టింగ్‌తో వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ క్లాసెన్‌ను తీసుకుంటున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది.
జనవరి 27, 28న బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన క్లాసెన్‌ని కొనుగోలు చేసేందుకు ప్రాంఛైజీలు ఆసక్తి కనబర్చలేదు. ఐపీఎల్ వేలం సమయంలో అందుబాటులో ఉన్న ఆటగాడిని భర్తీ చేసుకునే అవకాశం ఉండటంతో క్లాసెన్ వైపు మొగ్గు చూపింది రాజస్తాన్ రాయల్స్. దీనిలో భాగంగా బీసీసీఐకి తొలుత లేఖ రాసిన రాజస్తాన్.. ఆపై క్లాసెన్‌ను కొనుగోలు చేసింది. అయితే అతని కనీస ధర రూ. 50 లక్షలు మాత్రమే ఉండటంతో ఇదే మొత్తానికి క్లాసెన్‌కు సొంతం చేసుకుంది రాయల్స్.
టీమిండియాతో సిరీస్‌లో క్లాసెన్ చెలరేగిన నేపథ్యంలో అతన్ని తీసుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇచ‍్చింది. సాధారణంగా ఐపీఎల్ వంటి మెగా లీగ్‌ల్లో ఆటగాళ్లు జాక్‌పాట్ కొడుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. కానీ తక్కువ మొత్తానికి రాజస్తాన్ రాయల్స్ కు క్లాసెన్ దక్కడంతో ఇక‍్కడ సదరు ఫ్రాంచైజీ జాక్‌పాట్ కొట్టిందనే చెప్పాలి. స్మిత్ లేకపోయినా మరొక స్టార్ క్రికెటర్ తక్కువ మొత్తానికి దక్కడం ఆ జట్టుకు వరంగానే భావించొచ్చు. ఐపీఎల్ వేలానికి వచ‍్చే సమయానికి క్లాసెన్ ఒక సాధారణ క్రికెటర్ కావడంతో అతను కనీస ధర రూ. 50లక్షలుగా ఉంది. ఆ తర్వాత భారత్‌తో సిరీస్‌లో తన పించ్ హిట్టింగ్‌తో స్టార్ క్రికెటర్‌గా మారిపోయాడు.
క్లాసెన్ చేరికతో రాజస్థాన్ రాయల్స్ హిట్టర్ల జాబితా పెరిగింది. ఇప్పటికే రూ. 12.5 కోట్లకు ఇంగ్లండ్ హిట్టర్ బెన్‌స్టోక్స్‌ని కొనుగోలు చేసిన రాజస్తాన్ జట్టులో బట్లర్, త్రిపాఠి, సంజు శాంసన్ తదితర హిట‍్టర్‌లు ఉన్నారు. శనివారం నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సోమవారం తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఢీకొట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment