మూడో టెస్టుకు హెరాత్ దూరం
పల్లెకెలె (శ్రీలంక): మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా శనివారం ఇక్కడ భారత్ తో జరిగే మూడో టెస్టుకు శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ దూరం కానున్నాడు. గత మూడు వారాలుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న హెరాత్ కు భారత్ తో మూడో టెస్టుకు విశ్రాంతినిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అంతకుముందు శ్రీలంక ప్రధాన పేసర్ నువాన్ ప్రదీప్ గాయం కారణంగా టెస్టు సిరీస్ కు దూరమైన సంగతి తెలిసిందే. ' హెరాత్ విషయంలో ఎటువంటి రిస్క్ చేయదలుచుకోలేదు. శ్రీలంక ఆడిన చివరి మూడు టెస్టుల్లో హెరాత్ సుమారు 200 ఓవర్లకు పైగా బౌలింగ్ వేశాడు. దాంతో అతనిపై విపరీతమైన భారం పడింది. సాధారణంగా ఎవరికి విశ్రాంతి ఇవ్వం. కాకపోతే కొద్దిపాటి వెన్నునొప్పితో బాధపడుతున్న హెరాత్ కు విశ్రాంతి అవసరం'అని శ్రీలంక క్రికెట్ మేనేజర్ అసాంక గురుసిన్హా తెలిపారు.
ఇప్పటికే రెండు టెస్టులను కోల్పోయిన లంక జట్టు.. చివరిదైన మూడో టెస్టులో కనీసం పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. కాగా, వరుసగా కీలక ఆటగాళ్లు దూరం కావడం జట్టును మరింత ఇబ్బందులోకి నెడుతోంది. భారత్ తో టెస్టు సిరీస్ ఆరంభమైన నాటి నుంచి చూస్తే నలుగురు ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో లేకుండా పోయారు. అసేలా గుణరత్నే, ప్రదీప్, సురంగా లక్మల్ లు గాయాలు బారిన పడి సిరీస్ కు దూరమయ్యారు. ఇప్పుడు హెరాత్ కు కూడా విశ్రాంతి తప్పలేదు.