‘డ్రా’ చేసుకుంటే గొప్ప!
నేడు స్పెయిన్‌తో భారత్ ‘ఢీ’
హాకీ ప్రపంచకప్
ది హేగ్ (నెదర్లాండ్స్): చివరి నిమిషాల్లో గోల్స్ సమర్పించుకొని వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత హాకీ జట్టు మూడో పోరుకు సిద్ధమైంది. హాకీ ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగే గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో పటిష్టమైన స్పెయిన్‌తో భారత్ తలపడనుంది. పాదరసంలాంటి కదలికలకు... చిన్న చిన్న పాస్‌లతో ప్రత్యర్థి రక్షణ వలయంలో దూసుకుపోవడంలో సిద్ధహస్తులైన స్పెయిన్ ఆటగాళ్లను టీమిండియా ఏమేరకు నిలువరిస్తుందనే అంశంపైనే సర్దార్ సింగ్ బృందం అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
బెల్జియంతో జరిగిన తొలి మ్యాచ్‌లో 70వ నిమిషంలో... ఇంగ్లండ్‌తో జరిగిన పోటీలో 69వ నిమిషంలో గోల్స్ సమర్పించుకొని ఓటమి పాలైన భారత్ ఈ మ్యాచ్‌లో ఏం చేస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం భారత జట్టు ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే స్పెయిన్‌ను ‘డ్రా’తో నిలువరిస్తే గొప్ప అనుకోవాలి. రక్షణ శ్రేణిలో లోపాలు సరిదిద్దుకొని... పెనాల్టీ కార్నర్‌లను లక్ష్యానికి చేర్చడంలో సఫలమైతే మాత్రం భారత్ నుంచి ఈ మ్యాచ్‌లో విజయాన్ని ఆశించవచ్చు. పొరపాట్లు పునరావృతం చేస్తే మాత్రం ‘హ్యాట్రిక్’ ఓటమి ఖాయమనుకోవాలి.