మళ్లీ ఓడిన భారత్
న్యూఢిల్లీ: తమ నిరాశజనక ప్రదర్శన కొనసాగిస్తూ భారత జట్టు హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 1-3 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది. భారత్ తరఫున 69వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ ఏకైక గోల్ చేయగా... న్యూజిలాండ్‌కు స్టీఫెన్ జెనెస్ (40వ, 50వ నిమిషాల్లో) రెండు గోల్స్.. షియా మెక్‌లిస్ (తొలి నిమిషంలో) ఒక గోల్ అందించారు. ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 0-2తో ఓడిన సంగతి విదితమే. తొలి మ్యాచ్‌లో గోల్ చేయడంలో విఫలమైన టీమిండియా రెండో మ్యాచ్‌లో ఖాతా తెరిసింది. అయితే ఆట తొలి నిమిషంలోనే కివీస్ ప్లేయర్ షియా మెక్‌లిస్ గోల్ చేసి భారత్‌కు షాక్ ఇచ్చాడు.
విరామ సమయంలోపు ప్రత్యర్థికి మరో గోల్ ఇవ్వని భారత్ రెండో అర్ధభాగంలో చేతులెత్తేసింది. పది నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సమర్పించుకొని మూల్యం చెల్లించుకుంది. రెండో రోజే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో అర్జెంటీనా 3-2తో బెల్జియంపై, నెదర్లాండ్స్ 1-0తో ఆస్ట్రేలియాపై, ఇంగ్లండ్ 2-1తో జర్మనీపై విజయం సాధించాయి. ఆదివారం విశ్రాంతి దినం. సోమవారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్; ఆస్ట్రేలియాతో అర్జెంటీనా; నెదర్లాండ్స్‌తో బెల్జియం; జర్మనీతో భారత్ తలపడతాయి.