కుర్రాళ్లకు కఠిన పరీక్ష!
న్యూఢిల్లీ: కొత్త ఆటగాళ్లు... కొత్త కోచ్... కొత్త లీగ్... పునర్‌వైభవం కోసం పోరాడుతున్న భారత హాకీ జట్టు మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది. అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోతున్న భారత్... సొంతగడ్డపై జరుగుతున్న హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్)లోనైనా సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో నేడు జరగబోయే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో రాణించడం ద్వారా ప్రపంచకప్‌నకు సరైన రీతిలో సిద్ధం కావొచ్చని టీమిండియా ప్రణాళికలు వేస్తోంది.
ఈ టోర్నీకి భారత్ నేరుగా అర్హత సాధించకపోవడంతో ఆతిథ్య జట్టు హోదా కింద అవకాశం ఇచ్చారు. అయితే ప్రపంచ స్థాయి నాణ్యమైన జట్లు బరిలోకి దిగుతుండటంతో టీమిండియా ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలా మందికి అనుభవం తక్కువ. ఆటగాళ్లను గాడిలో పెట్టడంతో పాటు ఫలితాలనూ రాబట్టాల్సి ఉంటుంది కాబట్టి కొత్త విదేశీ కోచ్ టెర్రీ వాల్ష్ కూడా కఠిన పరీక్ష ఎదుర్కోనున్నారు. హెచ్‌డబ్ల్యుఎల్ సెమీఫైనల్లో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న భారత్... గతేడాది ఆసియా కప్‌లో రజతంతో సంతృప్తి పడింది.
నిలబడతారా?
పూల్-ఎలో భారత్‌తో పాటు ఒలింపిక్ చాంపియన్ జర్మనీ, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లు ఉండగా, పూల్-బిలో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, అర్జెంటీనాలు తలపడుతున్నాయి. ఈ జట్లను నిలువరించి ముందుకు పోవడం భారత కుర్రాళ్లకు అంత తేలిక కాదు. కోచ్ వాల్ష్ కూడా దీన్ని అంగీకరిస్తున్నాడు. గాయాల నుంచి కోలుకున్న ఎస్.వి.సునీల్, యువరాజ్ వాల్మీకి మళ్లీ జట్టులోకి రావడం, నికిన్ తిమ్మయ్య, మన్‌దీప్ సింగ్, యూసుఫ్‌లపై సెలక్టర్లు నమ్మకం పెట్టడంతో ఫార్వర్డ్ లైన్ తాజాగా కనిపిస్తోంది.
గోల్‌కీపర్ హర్‌జోత్ సింగ్ ఎంట్రీ భారత్‌కు కలిసొచ్చే అంశం. కెప్టెన్ సర్దార్‌తో పాటు ఉతప్ప, ధర్మవీర్ సింగ్, మన్‌ప్రీత్, చింగ్లెన్‌సనా సింగ్, అయ్యప్పలతో కూడిన మిడ్‌ఫీల్డ్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే బీరేంద్ర లక్రా, రూపిందర్‌పాల్ సింగ్, రఘునాథ్, కొతాజిత్ సింగ్, అమిత్‌లతో కూడిన బ్యాక్‌లైన్ సమస్యలను ఎదుర్కొంటుంది. వీళ్లలో ఏ ఒక్కరు కూడా స్థాయి మేరకు రాణించలేకపోతున్నారు. పెనాల్టీ కార్నర్ నిపుణులు రఘునాథ్, రూపిందర, అమిత్‌లు మెరుపులు మెరిపిస్తే భారత్ విజయం ఖాయం.
భారత్ x ఇంగ్లండ్ రాత్రి గం. 8 నుంచి టెన్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం