
వడోదర: కెప్టెన్ హనుమ విహారి (284 బంతుల్లో 150; 20 ఫోర్లు), రికీ భుయ్ (283 బంతుల్లో 145; 15 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగడంతో బరోడాతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్రకు తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్ మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర 9 వికెట్ల నష్టానికి 505 పరుగులు చేసింది. విహారి, భుయ్ మూడో వికెట్‌కు ఏకంగా 308 పరుగులు జోడించడం విశేషం.
బోడపాటి సుమంత్ (45 బ్యాటింగ్), విజయ్ కుమార్ (0 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. బరోడా బౌలర్లలో అతీత్ సేఠ్‌కు 5 వికెట్లు దక్కగా... పఠాన్ బ్రదర్స్ యూసుఫ్, ఇర్ఫాన్ ఇద్దరూ కలిసి 32 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. మంగళవారం ఆఖరి రోజు కావడంతో ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరగాల్సిన హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ మ్యాచ్ వరుసగా మూడో రోజు కూడా వర్షం బారిన పడింది. మైదానం తడిగా ఉండటంతో ఆటకు ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది.