Ranji Trophy: నరాలు తెగే ఉత్కంఠ.. మనోళ్లు ఆఖరి వరకు పోరాడి.. | Ranji Trophy 2024: Madhya Pradesh Beat Andhra By 4 Runs In Thrilling Win | Sakshi
Sakshi News home page

Madhya Pradesh vs Andhra: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి వరకు పోరాడి..

Published Mon, Feb 26 2024 12:37 PM | Last Updated on Mon, Feb 26 2024 12:57 PM

Ranji Trophy 2024: Madhya Pradesh Beat Andhra By 4 Runs Thrilling Win - Sakshi

హనుమ విహారి (PC: BCCI)

Ranji Trophy 2023-24- Madhya Pradesh vs Andhra, Quarter Final: రంజీ ట్రోఫీ 2023-24లో ఆంధ్ర జట్టు ప్రయాణం ముగిసింది. మధ్యప్రదేశ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో రికీ భుయ్‌ బృందం.. ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడి నాలుగు పరుగుల స్వల్ప తేడాతో పరాజయం చెందింది.

రంజీ తాజా ఎడిషన్‌ ఆరంభంలో కెప్టెన్‌గా వ్యవహరించిన హనుమ విహారి బ్యాటింగ్‌పై దృష్టి సారించే క్రమంలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా.. రికీ భుయ్‌ పగ్గాలు చేపట్టాడు. అతడి నాయకత్వంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆంధ్ర జట్టు క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. 

ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌తో పోటీకి సిద్ధమైన ఆంధ్ర.. శుక్రవారం మొదలైన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ను 234 పరుగులకు ఆలౌట్‌ చేసింది. కేవీ శశికాంత్‌ నాలుగు, నితీశ్‌రెడ్డి మూడు వికెట్లతో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు.

అయితే, బౌలర్లు అదరగొట్టినా.. బ్యాటర్లు మాత్రం ఆంధ్రకు శుభారంభం అందించలేకపోయారు. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే జట్టు కుప్పకూలింది. రికీ భుయ్‌ 32, కరణ్‌ షిండే 38 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. హనుమ విహారి 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు.

ఈ క్రమంలో 62 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్‌ను ఈసారి... 107 బౌలర్లకే ఆలౌట్‌ చేశారు ఆంధ్ర బౌలర్లు. ఈ నేపథ్యంలో 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర ఆదివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది.

హనుమ విహారి 43, కరణ్‌ షిండే 5 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో సోమవారం నాటి ఆట మొదలుపెట్టగా.. మరో 12 పరుగులను విహారి, తొమ్మిది పరుగులను కరణ్‌ తమ తమ స్కోర్లకు జతచేసి అవుటయ్యారు. మిగిలిన వాళ్లలో అశ్విన్‌ హెబ్బర్‌ 22 పరుగులతో రాణించగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం కరువైంది.

ఆఖర్లో గిరినాథ్‌రెడ్డి పట్టుదలగా నిలబడి జట్టును విజయం దిశగా నడిపించే ప్రయత్నం చేయగా 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 165 పరుగులకే పరిమితమైన ఆంధ్ర జట్టు.. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మధ్యప్రదేశ్‌ సెమీ ఫైనల్లో(Madhya Pradesh won by 4 runs Enters Semis) అడుగుపెట్టింది.

ఆంధ్ర వర్సెస్‌ మధ్యప్రదేశ్‌ క్వార్టర్‌ ఫైనల్‌ స్కోర్లు:
►మధ్యప్రదేశ్‌- 234 & 107
►ఆంధ్రప్రదేశ్‌- 172 & 165.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement