పైచేయి సాధించే అవకాశాన్ని మిస్సయ్యారు!
రాయ్పూర్: రంజీ ట్రోఫీలో అత్యుత్తమ రికార్డు కల్గిన ముంబై జట్టుపై పైచేయి సాధించే అవకాశాన్ని హైదరాబాద్ జట్టు కోల్పోయింది. క్వార్టర్ ఫైనల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్ లో 280 పరుగులకే పరిమితమైంది. దాంతో ముంబై తొలి ఇన్నింగ్స్ కు 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో ముంబైను 294 పరుగుకు కట్టడి చేసిన హైదరాబాద్.. బ్యాటింగ్ లో పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
మూడో రోజు ఆటలో 167/3 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన హైదరాబాద్ మరో 113 పరుగులు చేసి మిగతా వికెట్లను కోల్పోయింది. హైదరాబాద్ జట్టులో తన్మయ్ అగర్వాల్(82), బద్రీనాథ్(56), సుమంత్(44), హసన్(32) మినహా ఎవరూ రాణించలేకపోయారు. 25 పరుగుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లను హైదరాబాద్ కోల్పోవడంతో తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం సాధించడంలో హైదరాబాద్ విఫలమైంది. ముంబై బౌలర్లలో అభిషేక నాయర్ నాలుగు వికెట్లు సాధించగా,గోహిల్ కు మూడు, ఠాకూర్ కు రెండు వికెట్లు లభించాయి.