పరాజయం దిశగా...
లక్ష్య ఛేదనలో 7 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్
విజయానికి మరో 111 పరుగుల దూరం
అవకాశాన్ని అందిపుచ్చుకోలేని జట్టు
ముంబైతో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్
రాయ్‌పూర్: రంజీ ట్రోఫీలో 41 సార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబైపై సంచలన విజయం సాధించి దేశవాళీ క్రికెట్‌లో మళ్లీ వెలుగులీనే అవకాశాన్ని హైదరాబాద్ జట్టు చేజేతులా పోగొట్టుకునే పనిలో పడింది! బౌలర్లు చక్కటి ప్రదర్శన కనబర్చినా... పేలవ బ్యాటింగ్‌తో సాధారణ లక్ష్యాన్ని ఛేదించడానికి ఇబ్బంది పడి హైదరాబాద్ ఓటమి దిశగా సాగుతోంది. లీగ్ దశలో మెరుగైన ప్రదర్శనతో నాకౌట్‌కు అర్హత సాధించిన జట్టు పోరాటం క్వార్టర్ ఫైనల్‌కే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. వచ్చే సీజన్‌కు ‘ఎలైట్’ గ్రూప్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న సంతృప్తితోనే ఈ సీజన్‌ను ముగించాల్సి రావచ్చు. ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో 232 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జట్టు మ్యాచ్ నాలుగో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి 121 పరుగులే చేసి 7 వికెట్లు కోల్పోయింది. బాలచందర్ అనిరుధ్ (111 బంతుల్లో 40 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్స్) పోరాడుతున్నా... మిగిలిన 3 వికెట్లతో మరో 111 పరుగులు చేయడం దాదాపు అసాధ్యమే!
సిరాజ్‌కు 5 వికెట్లు...
ఓవర్‌నైట్ స్కోరు 102/3తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ముంబైని మొహమ్మద్ సిరాజ్ (5/52) దెబ్బ తీశాడు. అరుుతే కెప్టెన్ ఆదిత్య తారే (100 బంతుల్లో 57; 9 ఫోర్లు) రెండో ఇన్నింగ్‌సలోనూ అర్ధసెంచరీ చేసి ముంబైని ఆదుకున్నాడు. తారే, వాఘేలా (28) కలిసి నాలుగో వికెట్‌కు 58 పరుగులు జోడించిన అనంతరం మిలింద్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్‌స సెంచరీ హీరో సిద్ధేశ్ లాడ్ (97 బంతుల్లో 46; 6 ఫోర్లు) కొద్ది సేపు తారేకు సహకరించాడు. అయితే తారేను అద్భుత బంతితో సిరాజ్ బౌల్డ్ చేయడంతో ముంబై పతనం ప్రారంభమైంది. ఆ జట్టు తమ చివరి 6 వికెట్లను 70 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. సోమవారం ఆటలో ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయిఅదనంగా 115 పరుగులు జోడించగలిగింది. 10 మ్యాచ్‌ల కెరీర్‌లో తొలి సారి ఇన్నింగ్‌సలో ఐదు వికెట్లు పడగొట్టిన సిరాజ్ తీసిన ఐదు వికెట్లూ క్లీన్‌బౌల్డ్‌లే కావడం విశేషం!
అనిరుధ్ మినహా...
హైదరాబాద్ పేసర్లు చెలరేగిన పిచ్‌పైనే ముంబై లెఫ్టార్మ్ స్పిన్నర్ విజయ్ గోహిల్ పండగ చేసుకున్నాడు. సోమవారం ఆట చివరి అర గంటలో అతని దెబ్బకు హైదరాబాద్ బ్యాటింగ్ కుప్పకూలింది. నాలుగో ఓవర్లోనే అక్షత్ (1)ను నాయర్ అవుట్ చేయడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత తన వరుస ఓవర్లలో గోహిల్... తన్మయ్ (42 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్సర్లు), బద్రీనాథ్ (1)లను అవుట్ చేయడంతో జట్టు కష్టాలు పెరిగాయి. ఈ సమయంలో అనిరుధ్, సందీప్ (42 బంతుల్లో 25; 4 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 44 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే నాయర్ బౌలింగ్‌లో సందీప్ బౌల్డ్ కావడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. హైదరాబాద్ స్కోరు వంద పరుగులు దాటిన తర్వాత గోహిల్... 15 బంతుల వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టి చావుదెబ్బ తీశాడు.
స్కోరు వివరాలు
ముంబై తొలి ఇన్నింగ్స్ 294; హైదరాబాద్ తొలి ఇన్నింగ్‌స 280; ముంబై రెండో ఇన్నింగ్‌స: అల్మీదా (బి) మిలింద్ 1; వాఘేలా (బి) మిలింద్ 28; అయ్యర్ (బి) సిరాజ్ 12; సూర్యకుమార్ (బి) సిరాజ్ 3; తారే (బి) సిరాజ్ 57; లాడ్ (సి) మిలింద్ (బి) భండారి 46; నాయర్ (సి) రవికిరణ్ (బి) హసన్ 8; శార్దుల్ (సి) సిరాజ్ (బి) భండారి 12; గిరాప్ (బి) సిరాజ్ 11; దేశ్‌పాండే (బి) సిరాజ్ 4; గోహిల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 35; మొత్తం (83.2 ఓవర్లలో ఆలౌట్) 217.
వికెట్ల పతనం: 1-14; 2-32; 3-52; 4-110; 5-147; 6-156; 7-191; 8-202; 9-208; 10-217.
బౌలింగ్: రవికిరణ్ 16-4-40-0; మిలింద్ 17-5-25-2; హసన్ 15-5-19-1; సిరాజ్ 14.2-5-52-5; భండారి 21-6-55-2.
హైదరాబాద్ రెండో ఇన్నింగ్‌స: తన్మయ్ (సి) అండ్ (బి) గోహిల్ 29; అక్షత్ (సి) తారే (బి) నాయర్ 1; అనిరుధ్ (బ్యాటింగ్) 40; బద్రీనాథ్ (సి) అయ్యర్ (బి) గోహిల్ 1; సందీప్ (బి) నాయర్ 25; సుమంత్ (సి) తారే (బి) గోహిల్ 14; హసన్ (సి) వాఘేలా (బి) గోహిల్ 4; భండారి (బి) గోహిల్ 4; మిలింద్ (బ్యాటింగ్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (42 ఓవర్లలో 7 వికెట్లకు) 121.
వికెట్ల పతనం: 1-20; 2-41; 3-45; 4-89; 5-111; 6-115; 7-121.
బౌలింగ్: శార్దుల్ 6-0-36-0; నాయర్ 14-4-27-2; గిరాప్ 7-2-16-0; గోహిల్ 10-2-28-5; దేశ్‌పాండే 5-1-11-0.