హైదరాబాద్ 221 ఆలౌట్
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటింగ్‌లో నిలకడ లోపించింది. ఫలితంగా ఇక్కడి రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఆంధ్రతో జరుగుతున్న గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 76 ఓవర్లలో 221 పరుగులకే పరిమితమైంది. హనుమ విహారి (165 బంతుల్లో 75; 10 ఫోర్లు, 1 సిక్స్), అమోల్ షిండే (97 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఐదో వికెట్‌కు 102 పరుగులు జోడించి జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆంధ్ర బౌలర్లలో షాబుద్దీన్ 45 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, శివకుమార్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆంధ్ర రెండో రోజు సోమవారం ఆట ముగిసే సరికి 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. కేఎస్ భరత్ (39 బంతుల్లో 29; 7 ఫోర్లు) అవుట్ కాగా, డీబీ ప్రశాంత్ (95 బంతుల్లో 32 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఎం.సురేశ్ (50 బంతుల్లో 17 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు.
కీలక భాగస్వామ్యం...
44/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్ అదే స్కోరు వద్ద మరో రెండు వికెట్లు కోల్పోయింది. షాబుద్దీన్ వేసిన ఓవర్లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే గల్లీలో క్యాచ్ ఇచ్చి సుమన్ (12) వెనుదిరగ్గా...అదే ఓవర్ మూడో బంతికి సందీప్ (0) ఎల్బీగా అవుటయ్యాడు. ఈ దశలో విహారి, షిండే కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆరంభంలో పూర్తిగా నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యతనిచ్చిన ఈ ఇద్దరు ఆ తర్వాత కొన్ని చక్కటి షాట్లతో స్కోరు వేగం పెంచారు. ఈ క్రమంలో 92 బంతుల్లో విహారి, 89 బంతుల్లో షిండే అర్ధ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో పాటు భాగస్వామ్యం కూడా వంద పరుగులు దాటింది. షిండేను అవుట్ చేసి శివకుమార్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ వెంటనే ఆశిష్ రెడ్డి (10) కూడా షాబుద్దీన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. ఈ దశలో ధాటిగా ఆడిన కీపర్ హబీబ్ అహ్మద్ (32 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) కొద్ది సేపు విహారికి అండగా నిలవడంతో జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. ఏడో వికెట్‌గా విహారి వెనుదిరిగాక కొద్ది సేపటికే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది.
భరత్ దూకుడు...
అనంతరం ఆంధ్ర ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు భరత్, ప్రశాంత్ ధాటిగా ఆరంభించారు. మిలింద్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండు ఫోర్లు బాదిన భరత్, అదే బౌలర్ మూడో ఓవర్లో కూడా మరో రెండు ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించాడు. తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించిన అనంతరం ఆశిష్‌రెడ్డి హైదరాబాద్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆఫ్ స్టంప్ వచ్చిన బంతిని కట్ చేయబోయిన భరత్, కీపర్ హబీబ్ అద్భుత క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. మరో వైపు ప్రశాంత్ మాత్రం ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా సంయమనంతో ఆడాడు. టీ తర్వాత రెండో ఓవర్లో ఓజా బౌలింగ్‌లో స్లిప్స్‌లో ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను రవితేజ వదిలేయడం ప్రశాంత్‌కు కలిసొచ్చింది. మిలింద్ బౌలింగ్‌లో మోచేతికి దెబ్బ తగలడంతో కొద్ది సేపు చికిత్స చేయించుకున్న అనంతరం ఆటను కొనసాగించిన ప్రశాంత్...సురేశ్‌తో కలిసి అభేద్యంగా 43 పరుగులు జోడించి రెండో రోజు ఆటను ముగించాడు.