భారత్, బంగ్లాదేశ్ మధ్య ఫిబ్రవరిలో జరగాల్సిన టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని
నిధులివ్వాలని మాత్రమే కోరామన్న హెచ్‌సీఏ
హైదరాబాద్: భారత్, బంగ్లాదేశ్ మధ్య ఫిబ్రవరిలో జరగాల్సిన టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) స్పష్టం చేసింది. వచ్చే నెల 8 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. తమ దగ్గర తగినన్ని నిధులు లేవు కాబట్టి టెస్టు నిర్వహించలేమంటూ వచ్చిన వార్తలను హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడు నరేందర్ గౌడ్ ఖండించారు. ఇంగ్లండ్‌తో సిరీస్ తరహాలోనే బీసీసీఐ రాష్ట్ర సంఘానికి డబ్బులు ఇస్తే మ్యాచ్ నిర్వహణలో సమస్య లేదని ఆయన అన్నారు.
లోధా కమిటీ సిఫారసులు అమలు చేస్తామంటూ మొదట్లోనే అంగీకరించిన రాష్ట్ర సంఘాల్లో హైదరాబాద్ కూడా ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘మేం లోధా కమిటీ సిఫారసులు అమలు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడి తాజా పరిస్థితిని వివరిస్తూ బీసీసీఐకి లేఖ రాసిన మాట వాస్తవం. మ్యాచ్ నిర్వహణ కోసం డబ్బులు ఇవ్వమని కూడా కోరాం. ఇంగ్లండ్‌తో సిరీస్ సమయంలో లోధా కమిటీ వద్ద ముందస్తు అనుమతి తీసుకొని బోర్డు నిధులు విడుదల చేసింది. ఈసారి కూడా అలాగే ఇవ్వాల్సి ఉంటుందనే కోణంలోనే అడిగాం తప్ప మేం నిర్వహించలేమంటూ ఎక్కడా చెప్పలేదు. బోర్డు నుంచి నిధులు వస్తే మ్యాచ్‌కు ఎలాంటి సమస్యా ఉండదు’ అని నరేందర్ గౌడ్ వెల్లడించారు.