'క్రికెటర్ ను కావాలనుకున్నా'
న్యూఢిల్లీ:భారత క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లైన సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లకు తనో పెద్ద వీరాభిమానినని గూగూల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. గవాస్కర్ క్రికెట్ ఆడిన రోజుల్లోనే కాకుండా ఆ తరువాత కూడా ఆయనకు ఒక పిచ్చి అభిమానిగా ఉండేవాడినని పిచాయ్ తెలిపారు. తాను అసలు క్రికెటర్ ను కావాలనుకున్నానని తన మనసులోని మాటను బయటపెట్టారు సుందర్ పిచాయ్. గురువారం ఢిల్లీలోని శ్రీరాం కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి భేటీ అయిన సుందర్ పిచాయ్ వారితో తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
'చాలా మంది భారతీయ క్రికెటర్ల వలే నాకు కూడా క్రికెటర్ ను కావాలనే కోరిక అమితంగా ఉండేది. ఆ కలే ఎప్పుడూ నాలో మెదులుతూ ఉండేది. ఆ క్రమంలోనే గవాస్కర్ అభిమానిగా మారా. గవాస్కర్ క్రికెట్ ను వదిలేశాక కూడా ఆయనంటే తెలియని అభిమానం నాలో ఉండిపోయింది. అటు తరువాత సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడుతున్న రోజుల్ని ఎక్కువగా ఆస్వాదించా. వన్డే మ్యాచ్ లతో పాటు, టెస్టు మ్యాచ్ లను కూడా రెగ్యులర్ గా చూస్తూ ఉండేవాణ్ని. కాకపోతే ట్వంటీ 20 మ్యాచ్ ల్ని మాత్రం ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోయా'అని ఐఐటీ ఖరగ్ పూర్ పూర్వ విద్యార్థి, 43 ఏళ్ల సుందర్ పిచాయ్ తెలిపారు. ఇక ఫుట్ బాల్ లో లియోనెల్ మెస్సీ అంటే విపరీతమైన ఇష్టమని పేర్కొన్నారు.