
ధోనీకి ఉమేష్ యాదవ్ ఘాటైన సమాధానం!
బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా తన బౌలింగ్ శైలిని కించపరుస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై బౌలర్ ఉమేష్ యాదవ్ ఘాటుగా స్పందించాడు.
నాగ్ పూర్:బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా తన బౌలింగ్ శైలిని కించపరుస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై బౌలర్ ఉమేష్ యాదవ్ ఘాటుగా స్పందించాడు. తన బౌలింగ్ లోని పేస్ తోనే జట్టులో కొనసాగుతున్నానని స్పష్టం చేశాడు. అయితే ధోనీ ఉద్దేశించి నేరుగా ఆ వ్యాఖ్యలు చేయకపోయినా.. బౌలింగ్ లో వేగం, లైన్ అండ్ లెంగ్త్ విషయాలపై ఉమేష్ తనదైన శైలిలో జవాబిచ్చాడు.
కనీస ప్రమాణాలు కల్గిన ఫాస్ట్ బౌలర్ చేసే తప్పులు చాలా తక్కువగా ఉంటాయన్నాడు. ఫాస్ట్ బౌలర్ అనేవాడు నిలకడగా బౌలింగ్ చేయడం చాలా కష్టసాధ్యంతో కూడుకున్న పని అని తెలిపాడు. ఒక మీడియం పేసర్ 130 నుంచి 135 కి.మీ వేగంతో వేయడం సులభమే కానీ.. ఫాస్ట్ బౌలర్ బంతిని వేగంగా వేస్తూనే నియంత్రించడం అంత సులభం కాదన్నాడు.
'నేనెప్పుడైతే విఫలమవుతూ ఉంటానో.. అప్పుడు అనేక రకాలైన ప్రయోగాలు చేస్తుంటా. ఆ సమయంలో పరుగులు వెళుతుంటాయి. బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ లాగా నేను బౌలింగ్ చేయలేక పోవచ్చు. అతను కూడా నాశైలిలో బౌలింగ్ చేయలేడు. నా చేతి నుంచి విడుదల చేసే బంతి మీడియం పేసర్ల వేసే బౌలింగ్ కంటే భిన్నంగా ఉంటుంది. నా బౌలింగ్ ను మార్చుకోవాల్సి వస్తే గందరగోళం తప్పదు. నా పేస్ బౌలింగ్ తోనే జట్టులో ఉన్నా. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే చాలా వికెట్లు తీసి నేనేంటో నిరూపించుకున్నా'అని ఉమేష్ తెలిపాడు.