జోగీందర్ శర్మ (PC: రాయిటర్స్)
Team India Cricketers: భారత్‌లో క్రికెట్ మతం లాంటిది. ఇక క్రికెటర్లరంటే పడిచచ్చిపోయే అభిమానులకు కొదవే లేదు. ఇతర క్రీడాకారులెవరికీ లేని విధంగా సూపర్ క్రేజ్ మన క్రికెటర్ల సొంతం. కపిల్ దేవ్, సునిల్ గావస్కర్ నుంచి సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి దాకా ఎంతోమంది సంచలన రికార్డులు సృష్టించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.
ఇక ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుల రూపంలో చెల్లిస్తున్న మొత్తం కూడా కళ్లు చెదిరే రీతిలోనే ఉంటుంది. ఇదిలా ఉంటే.. మరి క్రికెట్ రంగానికి చేసిన, చేస్తున్న సేవలకు గానూ ప్రతిఫలంగా సముచిత గౌరవం, ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన క్రికెటర్లు ఎవరో తెలుసా?!
సముచిత గౌరవం
సచిన్ టెండుల్కర్
టీమిండియా దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కెరీర్‌లో 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించి ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. మేటి బ్యాటర్‌గా ఎదిగి టీమిండియా ముఖచిత్రంగా వెలుగొందాడు.
అతడి సేవలను గుర్తించి ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. ఇదిలా ఉంటే.. భారత వాయుదళంలో గ్రూప్ కెప్టెన్ హోదా కూడా అందుకున్నాడు సచిన్ టెండుల్కర్.
కపిల్ దేవ్
టీమిండియాకు మొట్టమొదటి ప్రపంచకప్ ట్రోఫీ అందించిన లెజెండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో కపిల్ డెవిల్స్ వెస్టిండీస్‌ను ఓడించి టైటిల్ సాధించింది. ఇక లెజెండ్ కపిల్ దేవ్‌ను భారత ఆర్మీ 2008లో లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించి సముచిత గౌరవం ఇచ్చింది.
మహేంద్ర సింగ్ ధోని
టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించాడు ధోని. టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 సాధించి లెజెండరీ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో మిస్టర్ కూల్‌కు భారత ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకుతో గౌరవించింది.
ప్రభుత్వ ఉద్యోగంలో..
హర్భజన్ సింగ్
భారత మేటి స్పిన్నర్లలో భజ్జీ కూడా ఒకడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏడు వందలకు పైగా వికెట్లు పడగొట్టిన ఈ ఆఫ్ స్పిన్నర్ పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. ఈ క్రమంలో పంజాబ్ పోలీస్.. భజ్జీని డిప్యూటి సూపరిండింటెండ్‌గా నియమించింది.
జోగీందర్ శర్మ
టీ20 ప్రపంచకప్-2007 చూసిన వారికి జోగీందర్ శర్మ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పాకిస్తాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో జోగీందర్ తీసిన వికెట్‌తో భారత్ రెండోసారి(వన్డే ఫార్మాట్‌తో కలిపి) విశ్వవిజేతగా అవతరించింది. ఈ క్రమంలో జోగీందర్ శర్మకు హర్యానాలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా అవకాశం వచ్చింది.
ఉమేశ్ యాదవ్
మహారాష్ట్ర పేసర్ ఉమేశ్ యాదవ్ చిన్ననాటి నుంచే భారత త్రివిధదళాల్లో ఏదో ఒక విభాగంలో పనిచేయాలని కల కన్నాడు. కానీ క్రికెటర్ అయ్యాడు. టీమిండియాకు ఆడే అవకాశం దక్కించుకున్న అతడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. నాగ్‌పూర్ శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా అవకాశం కల్పించింది.
యజువేంద్ర చహల్
టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పి టీమిండియాకు విజయాలు అందించిన సందర్భాలెన్న! ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పొట్టి ఫార్మాట్లో.. అత్యధికంగా 91 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన ఏకైన టీమిండియా బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
ఇలా భారత క్రికెట్‌కు తన వంతు సేవ చేస్తున్న చహల్‌కు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్.. టాక్స్ ఆఫీసర్‌గా ఉద్యోగం ఇచ్చింది. ఇక వీరితో పాటు టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు సైతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఉంది.
చదవండి: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగింపు.. భువనేశ్వర్ కుమార్ కీలక నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment