
ఇప్పుడేమీ చెప్పదలుచుకోలేదు:కోహ్లి
చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్కు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు.
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్కు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. రేపటి మ్యాచ్ కు సంబంధించి తమకు అందుబాటులో ఉన్న అన్ని వనరులపైనా చర్చించి ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే తమ జట్టు ప్రణాళిక ఏమిటో ఇప్పుడే చెప్పదలుచుకోలేదని కోహ్లి పేర్కొన్నాడు. అయితే భారత తుది జట్టులో స్వల్ప మార్పులు ఉంటాయనే సంకేతాలిచ్చాడు. అయితే జట్టును సమతుల్యంగా ఉంచడమే ఇక్కడ ప్రధానంగా కోహ్లి పేర్కొన్నాడు. సఫారీలతో మ్యాచ్ ను కూడా సాధారణ మ్యాచ్ లాగే తీసుకుని ఆడాలని ఆటగాళ్లకు సూచించాడు.
'రేపు జరిగే మ్యాచ్ లో నిలకడ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఎవరైతే పరిస్థితులకు తగ్గట్టు రాణిస్తారో వారిదే విజయం. గతంలో నాకు ఎదురైన అనుభవాల ఆధారంగానే ఈ విషయం చెబుతున్నా. మాకున్న అన్ని వనరులు గురించి ఇప్పటికే చర్చించాం. సఫారీలతో అమీతుమీ పోరుకు సిద్ధంగా ఉన్నాం. గ్రూప్ స్టేజ్ లో మాకు తప్పకుండా చివరి మ్యాచ్ కావడంతో పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతాం. మ్యాచ్ గురించి ప్రణాళికలు గురించి ఇప్పుడేమీ చెప్పదలుచుకోలేదు 'అని కోహ్లి పేర్కొన్నాడు.