చివర్లో వేగంపైనే దృష్టి: ద్యుతీ చంద్
బెంగళూరు: రేసు చివర్లో తన వేగాన్ని మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ చెప్పింది. ముఖ్యంగా ఆఖరి 40 మీటర్లలో వేగం పెంచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టిసారించానని తెలిపింది. ‘తొలి 60 మీటర్లలో నా వేగం బాగుంది. కానీ చివరికి వచ్చేసరికి వేగం మందగిస్తోంది. ఇప్పుడు ఆ వేగాన్ని కూడా మెరుగుపర్చుకోవాలి. దాని కోసం బాగా శ్రమిస్తున్నా. మా కోచ్ రమేశ్ సర్ కూడా దీనిపై ఎక్కువగా దృష్టిపెట్టారు’ అని ద్యుతీ పేర్కొంది. కాలం మారుతున్న కొద్దీ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడం అంత సులువు కాదని వెల్లడించింది. అథ్లెట్ల ప్రదర్శన మెరుగుపడుతున్నా... పోటీ బాగా పెరిగిపోయిందని ఈ ఒడిషా అథ్లెట్ వెల్లడించింది. గతేడాది బీజింగ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విక్టోరియా జైబికినా (కజకిస్తాన్)తో పోటీపడటం తనకు బాగా కలిసొచ్చిందని చెప్పింది.
మరోవైపు ద్యుతీలో పోరాట స్ఫూర్తి అమోఘమని ఆమె కోచ్ నాగపూరి రమేశ్ అన్నారు. జీవితంలో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలే ఆమెను ఉన్నత శిఖరాలకు చేర్చాయన్నారు. తన 20 ఏళ్ల కోచింగ్ కెరీర్‌లో ద్యుతీలాంటి అథ్లెట్‌ను చూడలేదని చెప్పిన కోచ్.. శిక్షణ కంటే పోటీల్లో బరిలోకి దిగడాన్నే ద్యుతీ ఎక్కువగా ఇష్టపడుతుందని చెప్పారు.