న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ద హండ్రెడ్(వంద బంతుల లీగ్) లీగ్‌లో తాను ఆడుతున్నానంటూ వచ్చిన వార్తలను టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఖండించాడు. ఆ లీగ్‌లో తాను ప్రాతినిథ్యం వహించడం లేదని వివరణ ఇచ్చుకునే యత్నం చేశాడు. ‘ నేను ఆ లీగ్‌లో ఆడటానికి ఆసక్తిగా లేను. అయినప్పటికీ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతానో.. లేదో తెలియదు. ఒకవేళ ఐపీఎల్ ఆడతావా.. లేక ద హండ్రెడ్ ఆడతావా అంటే ఐపీఎల్‌కే మొగ్గుచూపుతా. ఒకవేళ వచ్చే సీజన్‌లో సీఎస్‌కే నాకు అవకాశం ఇస్తే కచ్చితంగా ఆ జట్టుకు ఆడతా. నాకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిబంధనలు తెలుసు. నేను వాటిని తప్పకుండా అనుసరిస్తా. నేను అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి ద హండ్రెడ్ ఆడాల్సిన అవసరం నాకు ప్రస్తుతం లేదు. దాంతో నేనేమీ రిటైర్మెంట్ ప్రకటించడం లేదు’ అని భజ్జీ పేర్కొన్నాడు. 2016లో చివరిసారి భారత జెర్సీ ధరించిన హర్భజన్ సింగ్.. గత రెండేళ్ల నుంచి ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆడుతున్నాడు. గత సీజన్‌లో హర్భజన్ 16 వికెట్లు సాధించాడు.
వచ్చే ఏడాది వంద బంతుల క్రికెట్‌ను నిర్వహించడానికి ఈసీబీ రంగం సిద్ధం చేయగా, అందులో హర్భజన్ సింగ్ పాల్గొనడానికి సంసిద్ధత వ్యక్తం చేశాడని వార్తలు వచ్చాయి. ద హండ్రెడ్ లీగ్‌ను గురువారం అధికారికంగా లాంచ్ చేయగా, పలువురు ఆటగాళ్లు పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో భారత్ నుంచి హర్భజన్ సింగ్ పేరు వినిపించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందిస్తూ.. రిటైర్మెంట్ కాని ఆటగాళ్లు ఎవరికీ విదేశీ లీగ్ ఆడటానికి అనుమతి ఇవ్వడం లేదనే విషయాన్ని స్పష్టం చేసింది. అదే సమయంలో హర్భజన్ సింగ్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ బీసీసీఐ నియమావళిని గౌరవిస్తానని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment