జైపూర్: ఐపీఎల్-6లో బయటపడ్డ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతాన్ని తాము ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. జట్టు సమష్టిగా ముందుకు సాగుతోందని చెప్పాడు. ‘గత సీజన్ దుష్ర్పభావం మాపై లేదు. వాటన్నింటిని పక్కనబెట్టాం. క్రమశిక్షణ చర్యలు కూడా పరిష్కారమయ్యాయి. ఇప్పుడు మా జట్టులో 15 మంది ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడే ఫిక్సింగ్ ఎపిసోడ్‌పై చర్చించుకున్నాం. ఇక దాన్ని పక్కనబెట్టి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం.
ఓ జట్టుగా మా అభిమానులకు ఆనందాన్ని కలిగించాలి. ఇందుకోసం మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టయిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు శ్రీశాంత్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.