నా వ్యాఖ్యలు వక్రీకరించారు: ద్రవిడ్
భారత్ క్రికెట్ సంఘం(బీసీసీఐ) విశ్వసనీయతపై తాను చేసిన వ్యాఖ్యలు వక్రీకరణకు గురయ్యాయని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. తన వ్యాఖ్యలు వక్రీకరణకు గురవడం పట్ల 'మిస్టర్ డిపెండబుల్' అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను మాటాడిన మాటలను సందర్భ రహితంగా చేసి మీడియాలో ఒక వర్గం వక్రీకరించిందని పేర్కొన్నాడు.
ఈఎస్పీఎన్ 'క్రిక్ఇన్ఫో'కు ఇచ్చిన ద్రవిడ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఐపీఎల్-6లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో అతడు స్పందించినట్టు తెలిపాయి. క్రికెట్‌పై విశ్వసనీయత పెరిగేలా ఆటగాళ్ల, పరిపాలకుల ప్రవర్తన ఉండాలని, ప్రజా జీవితంలో ఉన్న వారికి ఇది మరీ ముఖ్యమని అతడు వ్యాఖ్యానించాడని కథనాలు వచ్చాయి. అయితే ద్రవిడ్ ఇంటర్వ్యూ ను రేపు పాఠకులకు అందుబాటులో ఉంచనున్నట్టు ఈఎస్పీఎన్ 'క్రిక్ఇన్ఫో' తెలిపింది.
ద్రవిడ్ వ్యాఖ్యలతో మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఏకీభవించాడు. అబిమానులు ఆటను తప్ప మరేమీ పట్టించుకోరన్న భావనతోనే క్రికెట్ వ్యవహారాల పర్యవేక్షకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాజీ స్పిన్నర్ ద్రవిడ్ వ్యాఖ్యలను ఎర్రాపల్లి ప్రసన్న కూడా సమర్థించారు.